హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరు చెప్పి ఎవరైనా అక్రమ లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటీసులు ఇచ్చి వసూళ్లకు పాల్పడుతుందంటూ హైడ్రాపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కమిషనర్ సమాధానమిస్తూ.. అలాంటి ఫిర్యాదులుంటే తన దృష్టికిగానీ, ఏసీబీ, విజిలెన్స్, పోలీసులకు సమాచారమిచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
వంశీరామ్ బిల్డర్స్పై తాను ఫిర్యాదు చేశానని అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి హైడ్రాపై చేసిన కామెంట్లను రంగనాథ్ ఖండించారు. తమకు గత సంవత్సరం ఆగస్టు 18, డిసెంబర్ 21 తేదీల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నుంచి రెండు ఫిర్యాదులు అందాయని, ఖాజాగూడలోని తౌతాని కుంటలో నీరు నిలిచిపోవడంతో గ్రీన్‌గ్రేస్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు చేరుతుందనేది అందులో ఒక ఫిర్యాదు కాగా, మరొకటి తౌతానికుంట నిండిన తర్వాత వరద నీరు భగీరథమ్మ చెరువుకు వెళ్లడం లేదనేది అని, వీటిపై తానే రెండుసార్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నట్టు తెలిపారు.
అయితే వంశీరామ్ మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌పై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నట్టు తెలిపారు.