దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు పూర్తయినయ్. స్వాతంత్య్ర పోరాటాలు.. త్యాగాలను మనం ఇప్పటికీ మననం చేసుకుంటున్నం. ఇదే తరహాలో మన తాతల కథ.. తండ్రుల కథ.. మన జాతి కథను ఉడుకునెత్తురుతో ఉరకలెత్తే యువతరం తెలుసుకోవాలి. పుట్టిన గడ్డ.. జన్మనిచ్చిన మట్టి కథను యువత చదువుకోకపోతే.. తెలుసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది.
– కేటీఆర్
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్సేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. వందలాది మందిని బలితీసుకున్నది ఈ కాం గ్రెస్ విలనే’నని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ‘తుపాకీ మోతలతో గైర్ ములీ ఉద్యమంలో ఏడుగురిని బలికొన్న విల న్ కాంగ్రెస్ పార్టీయే..1956లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెండ్లి చేసింది కూడా కాంగ్రెస్ విలనే. 1968 నుంచి 1971 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ 370 మంది విద్యార్థులను తుపాకీ తూటాలకు కరశంగా బలిగొన్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే.. మా తెలంగాణ మాకు ఇవ్వండని అడిగిన ప్రతిసారీ ఉద్యమాన్ని అణచివేసింది కాం గ్రెస్ పార్టీయే. 2001లో కేసీఆర్ నేతృత్వంలో గులాబీ జెండా ఎగిరిన తర్వాత రాష్ట్రం ఇస్తామని, ఎన్నికల ఎజెండాలో పెట్టి, కామన్ మిని మం ప్రోగాంలో పెట్టి, రాష్ట్రపతి చేత చెప్పించి పదేండ్ల పాటు కాల్చుకుతిన్నది.. వందలు, వేల మంది విద్యార్థులను బలిగొన్నది కాంగ్రెస్సే.. నని ధ్వజమెత్తారు.
తెలంగాణలో హీరోలు ఎవరో.. విలన్లు ఎవ రో యువత తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ కథలో మహోన్నతమైన గ తం.. మహోజ్వల చరిత్ర ఉన్నది. బానిస సంకె ళ్లు తెంచిన పోరాట కథ.. వీరుడు.. కథనాయ కుడు.. వీరోచిత గాథలు.. పోరాటాలు, అమరు లు ఒక వైపు ఉంటే.. మరో వైపు ద్రోహాలు.. ధోకాలు కూడా ఉన్నయి. తెలంగాణ కథలోనూ శకుని, శిఖండి.. మారీచుడు, దుశ్సాసనుడు ఎవరో.. హీరోలెవరో, విలన్లు ఎవరో వర్తమాన తరం తెలుసుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ .. ‘కేసీఆర్ శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్ర నో’ అని కేసీఆర్ మొండిగా కూర్చోకపోతే తెలంగాణ రాష్ట్రమనేదే ఉండేది కాదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఎత్తిన జెండా దించనని.. దించి తే రాళ్లతో కొట్టండని ప్రతినబూనిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. ఇలాంటి నాయకుడు దేశంలో ఎకడాలేరని తేల్చిచెప్పారు. ‘ఏపీ నుంచి వెళుతున్నా.. మళ్లీ తిరిగి తెలంగాణలోనే కాలుపెడుతా’ అని చెప్పి న ఖలేజా.. గుండె ధైర్యం గల శక్తి.. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మ హనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్‌కు తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలబడిందని, తెలంగాణ ఆషామాషీగా ఏర్పడలేదని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని ప్రజానీకం కల్పించిందని, ‘ఇస్తవా.. సస్తవా’ అని తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ మెడమీద కత్తిపెట్టకపోతే తెలంగాణ సాకారమయ్యేదే కాదని తేల్చిచెప్పారు.
సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్ ఉచిత కరెంట్ అని చెప్పినా అది ఉత్త కరెంట్ అయ్యిందని కేటీఆర్ విమర్శించారు. ఏనాడూ నాణ్యమైన ఉచిత విద్యుత్తునివ్వలేదని తెలిపారు. సాగుకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను మలిచామని గుర్తుచేశారు. ‘నల్లగొండ జిల్లాకు ఫ్లోరోసిస్ దరిద్రం నుంచి విముక్తి కల్పించినం. మర మగ్గాల మీద మరణ మృదంగాన్ని ఆపినం. రైతుల ఆత్మహత్యలు తెలంగాణలోనే తక్కువని టైమ్స్ ఆఫ్ ఇండి యా అనే పత్రిక రాసే పరిస్థితి కల్పించినం. ఇ లాంటి ఎన్నో విప్లవాలను తెచ్చినం’ అని గుర్తుచేశారు. ‘రైతు దగ్గర డబ్బుల వసూలు చేసిన ప్రభుత్వాలున్నయి. కానీ మేం హామీ ఇవ్వకపోయినా రైతుబంధు పథకాన్ని తెచ్చినం. 72 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు జమచేసినం. ఏదీ చేసినా పాషన్‌తో, ఒక టాస్క్‌గా తీసుకొని ప్రయత్నించినం’ అని గుర్తుచేశారు.
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మలిచామని కేటీఆర్ వివరించారురు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌లను పూర్తిచేయగలిగామని చెప్పారు. ‘ఒకప్పుడు సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుంటే.. మేం దిగిపోయే నాటికి 2.29 కోట్ల ఎకరాలకు చేర్చినం. మిషన్ కాకతీయ, కాళేశ్వరం సహా పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసినం. ఒకప్పుడు ఆదర్శ గ్రామమంటే గంగదేవిపల్లి మాత్రమే. కానీ దేశంలో టాప్ 20 బెస్ట్ విలేజ్‌లలో 19 మన రాష్ట్రం నుంచే ఉండే స్థాయికి చేర్చినం.
జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తాను చెప్పిన విషయాలు తప్పని ఎవరైనా రుజువు చేయగలరా? అని సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్, బీజేపీ నేతలెవరైనా తాము పాలిస్తున్న రాష్ర్టాలు కేసీఆర్ కంటే ఎక్కువ సాధించినట్టు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటా.. బీజేపీ పాలిస్తున్న 25 -26 రాష్ర్టాల్లో ఎక్కడైనా మా కంటే ఎక్కువ చేశామని చూపిస్తే.. రాజకీయాలకు గుడ్‌బై చెబుతా’ అని సవాల్ విసిరారు. తాను గణాంకాలు, కాగ్ లెక్కలు సహా వివరాలను ముందుంచానని చెప్పారు. కాంగ్రెస్ రుజువు చేసినా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. కేసీఆర్ పథకాలను మోదీ ప్రభుత్వం, పలు రాష్ర్టాలు కాపీ కొట్టాయని గుర్తుచేశారు. రైతుబంధును పీఎం కిసాన్ సమ్మాన్.. కాలియా.. కృషిబంధు పేరిట.. మిషన్ భగీరథను హర్ ఘర్ జల్.. మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరిట కాపీకొట్టాయని సోదాహరణంగా వివరించారు.
మేము మమకారంతో పనిచేస్తే కొందరు అహంకారమని ముద్ర వేశారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డదని.. నలుగురి కోసమే తెలంగాణ అని విష ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ మొత్తం నాలుగు కోట్ల ప్రజలు తమ కుటుంబంగా భావిస్తే.. నలుగురి కోసమేనా అంటూ దుష్ప్రచారం చేశారని వాపోయారు. ‘అధికారం శాశ్వతం కాదు. అలా అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ఎవరెన్ని ప్రచారాలు చేసినా దుర్మార్గమైన ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా తదేక దీక్షతో ముందుకెళ్లాం. అధికారం పోయిందన్న బాధ ఏమాత్రం మాకు లేదు’ అని స్పష్టంచేశారు. కానీ కష్టపడి త్యాగాలతో ఏర్పడ్డ రాష్ర్టానికి ఒక ద్రోహి ముఖ్యమంత్రిగా ఉండటం అత్యంత బాధాకరమని వాపోయారు. తెలంగాణ వాదుల మీదికి తుపాకీ ఎత్తిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దిందని చెప్పారు. ‘కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎం. డబ్బులెక్కువెవరిస్తే.. వాళ్లకే సీఎం పదవి వస్తదని అందరికీ తెలిసిందే’నని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ఫస్ట్ ఆఫ్ డిజాస్టర్ అని కేటీఆర్ అభివర్ణించారు. ‘సెకండాఫ్ కూడా డిజాస్టర్ కావడం ఖాయమని చెప్పారు. సినిమా భాషలో చెప్పాలంటే ఒక సినిమా హిట్టా.. ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. మన దగ్గర ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సెకండ్ హాఫ్ కూడా పక్కా డిజాస్టర్’ అని జోస్యం చెప్పారు. నూరు రోజు లు ఆరు గ్యారెంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిండ్రు. ఆర్థిక పరిస్థితి ఏమిటంటే మాకు అపారమైన అనుభవమున్నది.. చేసి చూపిస్తామన్నారు. ఇప్పుడు ఎంత కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లో పిల్లలు పుట్టిస్తడా? అంటున్నరు. మూడు నెలల్లో పుట్టరని మాకు తెలుసు. కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే ఏమని పిలువాలి?’ అంటూ ప్ర శ్నించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలి స్టు రవికాంత్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి వరికుప్పల రమేశ్, ఉపాధ్యక్షులు రా జేశ్, అరుణ, కోశాధికారి రమేశ్ వైట్ల, సంయుక్త కార్యదర్శులు హరిప్రసాద్, వర్దెల్లి బాపురావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ప్రత్యేకత ఉన్నదని కేటీఆర్ గుర్తురేశారు. తెలంగాణకు పెద్ద చరిత్ర ఉన్నదని.. తరాలు మారినా, స్వరాలు మారినా వాస్తవాలు మారవని స్పష్టంచేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏండ్లు గడిచిపోయిందని తెలిపారు. ‘ఎన్నో త్యాగాలు, పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు పూర్తయినయ్. స్వాతంత్య్ర పోరాటాలు.. త్యాగాలను మనం ఇప్పటికీ మననం చేసుకుంటున్నం. ఇదే తరహాలో మన తాతల కథ.. తండ్రుల కథ.. మన జాతి కథను ఉడుకునెత్తురుతో ఉరకలెత్తే యువతరం తెలుసుకోవాలి’ అని సూచించారు. ‘పుట్టిన గడ్డ.. జన్మనిచ్చిన మట్టి కథను యువత చదువుకోకపోతే.. తెలుసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది’ అని చెప్పారు.
వలసలు, కరువులతో నెర్రెలుబారిన నేలల్లో.. నెత్తురుతో తడిసిన నేలల్లో సాగునీరు పారించామని కేటీఆర్ వివరించారు. ‘అన్నమో రామచంద్రా’ అనే రాష్ర్టాన్ని దేశానికే అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ నాయకత్వంలో చేర్చామని గుర్తుచేశారు. ఉద్యమ తెలంగాణను.. ఉజ్వల తెలంగాణగా నిలబెట్టాలనే బృహత్తర యజ్ఞం చేశామని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దశాబ్దంలో సుసంపన్నమైన.. సస్యశ్యామల.. సిరిసంపదల తెలంగాణను ఆవిష్కరింపజేసి దేశం ముందుపెట్టామని వివరించారు. ‘అసలు తెలంగాణకు నాయకత్వ పటిమ.. సామర్థ్యమున్నదా?’ అన్న ప్రశ్నల నుంచి ‘మాకు కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు’ అనే మాటను దేశం చేత అనిపించగలిగామని చెప్పారు. ‘దట్ ఈజ్ తెలంగాణ. దట్ ఈజ్ కేసీఆర్.. దట్ ఈజ్ బీఆర్ఎస్’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ అమోఘమైన ఆర్థిక విప్లవాన్ని సృష్టించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ‘మేం ప్రభుత్వంలోకి వచ్చిన నాడు తలసరి ఆదాయంలో 12వ ర్యాంకులో ఉండే.. మేం వైదొలగేనాడు రూ.3.47 లక్షల తలసరి ఆదాయంతో నంబన్ వన్‌కు చేర్చినం’ అని కేటీఆర్ గుర్తుచేశారు. జీఎస్డీపీ నాలుగున్నర లక్షల కోట్లు ఉంటే.. ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి 15 లక్షల కోట్లకు చేర్చామన్నారు. మధ్యలో కరోనా అడ్డు వచ్చినా ఎక్కడా ఆగలేదని చెప్పారు. 200 గురుకులాలను వెయ్యి గురుకులాలకు తీసుకెళ్లామని వివరించారు. ‘ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి తెల్లకోటు విప్లవాన్ని సృష్టించినం. ఇన్‌ల్యాండ్ ఫిషరీస్‌లో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టినం. కొత్త పరిశ్రమలొస్తాయా? ఉన్న పరిశ్రమలు ఉంటాయా? తరలిపోతాయా? అనే అనుమానపు నీడలను పటాపంచలు చేసినం. విశ్వవిఖ్యాత కంపెనీలకు తెలంగాణను చిరునామాగా మార్చినం. ఐటీ కొలువులను 10 లక్షలకు తీసుకుపోయినం. బెంగళూరును వెనక్కి నెట్టినం. ఇది మన దేశంలోనే ఎవరూ చేయని ఫీట్ అంటూ గుర్తుచేశారు.