హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెల్నెస్ సెంటర్‌కు వెళ్లాలి. ఓపీ అక్కడే చూస్తారు. వైద్య పరీక్షలు అక్కడే నిర్వహిస్తారు. రిపోర్టులు వచ్చాక.. ప్రైవేట్ దవాఖానకు రెఫర్ చేస్తే మాత్రమే అడ్మిట్ చేసుకుంటారు. ఇలా కాకుండా నేరుగా ప్రైవేట్ దవాఖానకు వెళితే ఓపీకి.. వైద్య పరీక్షలకు డబ్బులు చెల్లించాల్సిందే’ ఇది ఎంప్లాయెస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలయ్యే విధానం. ఈ విధానంపై ఉద్యోగులు, టీచర్లు ఈహెచ్ఎస్ ట్రస్టు బోర్డు సభ్యులు సైతం అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. సీఎస్ సంజయ్‌జాజు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో ట్రస్టు బోర్డు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానల్లోను ఓపీ, వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకునేలా మార్పులు చేయాలని కొందరు ట్రస్టుబోర్డు సభ్యులు కోరినట్టు తెలిసింది. అయితే వెల్నెస్ సెంటర్లను మరికొన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకు రూ.44 కోట్లు కేటాయిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టు సమాచారం. ఈ నెల 13న మరోసారి ట్రస్టుబోర్డు సమావేశం నిర్వహించి.. సమగ్ర మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. మహేష్‌దత్ ఎక్కా, క్రిస్టినా జెడ్ చోంగ్తూ, సిక్తా పట్నాయక్, హనుమంత్ కొండిబా, షిఖా గోయల్, మారం జగదీశ్వర్ (టీఎన్జీవో), ఏలూరి శ్రీనివాసరావు (టీజీవో), పుల్గం దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూ టీఎస్) సీహెచ్ రవి(టీఎస్ యూటీఎఫ్), సదానందంగౌడ్ (ఎస్టీయూ), శ్రీనివాస్‌రెడ్డి (సచివాలయ ఉద్యోగుల సంఘ) ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వైద్య పరీక్షలు, ఓపీ సేవలు ఉచితంగా కల్పించకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారీ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. డాక్టర్లు సైతం ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వైద్య పరీక్షలకే వేలకు వేలు ఖర్చువుతున్నాయి. క్యాన్సర్ టెస్ట్‌లు, ఎంఆర్ఐ, యాంజియోగ్రామ్లకు వేలకు వేలు ఖర్చుచేయాల్సిన పరిస్థితులున్నాయి. వెల్నెస్ సెంటర్లున్నా.. అవి సక్రమంగా పనిచేయడంలేదు. నిపుణులైన డాక్టర్లు, పరికరాలుండటం లేదు. మందులు కూడా లభ్యం కావడంలేదు. మళ్లీ వెల్నెస్ సెంటర్లకు పంపించడమంటే ఇబ్బందులకు గురిచేయడమేనని ఉద్యోగులు వాపోతున్నారు.