రవీంద్రభారతి, జూన్ 17 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హమీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఆర్ కృష్ణయ్య తదితరులు మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనడం దారుణమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మరోమారు బీసీలను మోసం చేస్తున్నదని, ఆ పార్టీని బంగాళఖాతంలో వేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కాల్చుకోకతప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్నిగుండంగా బీసీలు మారుస్తారని, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. కులగణన చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే బీసీలు ఊరుకునే ప్రసక్తేలేదని, తక్షణమే బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్డ్‌లో చేర్చి, జీవో ఇచ్చి చట్టం చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లిపల్లి అంజి, జీ అనంతయ్య, వేముల రామకృష్ణ, రామ్‌దేవ్ మాధవ్, సతీశ్, నిఖిల్‌పటేల్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.