హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): పంటలను నాశనం చేసే చీడ పురుగులను నియంత్రించేందుకు ఇక్రిశాట్ సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇండ్లలో ఎలుకలు, బొద్దింకలు, బల్లులను కట్టడి చేసేందుకు జిగురుతో కూడిన ప్లేట్లను వినియోగిస్తున్నట్టుగానే పంటలను చుట్టుముట్టే పురుగుల నుంచి కాపాడేందుకు ప్రత్యేక రసాయనాలతో కూడిన స్టిక్కర్ ట్రాప్లను డెవలప్ చేసింది.
మొక్క వద్దకు చేరిన చీడపురుగులను ఈ స్టిక్కర్ ఆకర్షిస్తుంది. దీంతో అవి స్టిక్కర్లోని జిగురుకు అతుక్కుని చనిపోతాయి. గతంలో రైతులు నూనె, గ్రీసు లాంటి జిగురు పదార్థాలను పేపర్లపై పూసి వాటిని పంటపొలాలు, తోటల్లో వేలాడదీసేవారు. ఆ విధానానికి ఇక్రిశాట్ కొంత శాస్త్రీయతను జోడించి స్టిక్కర్ ట్రాప్లను అభివృద్ధి చేసింది.
ఇప్పటికే వీటిని ఒడిశాలోని పలు కొండ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ పరీక్షల్లో సత్ఫలితాలు రావడంతో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. పంట దిగుబడిని పెంచడంలో పూత దశ అత్యంత కీలకమైనది. ఈ దశలో చీడలను నియంత్రించగలిగితే 80-90 శాతం మేరకు దిగుబడిని పొందే వీలుంటుంది.