హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : మూసీ పరీవాహక ప్రాంతంలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించాలని, కాబట్టి అక్కడున్న ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న చాలామంది ఇప్పటికే ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోగా, మరికొందరు మాత్రం వెళ్లేందుకు మొండికేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎలాగైనా ఖాళీ చేయించాలని, ఆ ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించేందుకు థీమ్ పార్క్ నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మూసీనది ప్రక్షాళనపై శనివారం అధికారులతో రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ టవర్ కోసం అవసరమైన డిజైన్లు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. థీమ్ పారు, టవర్‌ను అనుసంధానం చేస్తూ ఒక ఎలివేటెడ్ గేట్‌వేని కూడా నిర్మించాలని, దానికి గేట్‌వే ఆఫ్ హైదరాబాద్ అని పేరు పెట్టాలని సూచించారు.
మూసీనది పరీవాహక ప్రాంతంలో ఇంకా మిగిలిన ప్రజలను ఇండ్ల నుంచి ఖాళీ చేయించాలని, ఆ ప్రక్రియ పూర్తికాగానే ఆ ప్రాంతాన్ని అధునాతన ప్రాజెక్టులతో అభివృద్ధి చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా హిమాయత్ సాగర్‌లోని గాంధీ సరోవర్ వద్ద గేట్ వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇది నగరానికి వచ్చే పర్యాటకులందరికీ స్వాగతం పలికేలా ఒక ముఖద్వారంగా ఉండాలని సూచించారు. ఓఆర్ఆర్కు ఒక వైపు ఎకో థీమ్ పార్కు ఏర్పాటు చేయాలని, మరో వైపు భారీ ఐకానిక్ టవర్‌ను కట్టాలని సూచించారు. బాపూఘాట్ చుట్టూ ఉన్న ఏరియాను వరల్డ్ క్లాస్ జోన్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్డు నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని, గాంధీ సరోవర్ చుట్టూ ఈ ఫ్లైఓవర్ కనెక్టివ్ కారిడార్‌లా ఉండే విధంగా డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా గాంధీ సరోవర్కు చేరుకునేలా కనెక్టివిటీ ఉండాలని సూచించారు.
మూసీ నదికి ఇరువైపులా అండర్ గ్రౌండ్లో భారీ వాటర్ స్టోరేజ్ సంప్ నిర్మించి, నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా నిర్మాణాలు చేయాలని సీఎం ఆదేశించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లోని తాగునీటిని మరింత సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వాటర్ ఫ్లోను అధ్యయనం చేసి రెండు నెలల్లోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల వల్ల నగరంలో వరద సమస్యకు శాశ్వత పరిషారం లభించడంతో పాటు.. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.