చిన్నప్పుడు ప్రతి తల్లి బిడ్డ కడుపు నింపేందుకు చందమామ రావే.. జాబిల్ల్లి రావే.. అని ఆకాశంలోని చందమామను చూపించి గోరుముద్దలు పెడుతుంది. ఆ చందమామ రాదని ఆ తల్లికి తెలుసు. కానీ బిడ్డ కడుపు నిండాలనే ప్రేమతో అబద్ధం చెప్తుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ గడ్డ మీద గోదావరి జలాల్ని కొల్లగొట్టేందుకు నయా చందమామ కథల్ని వినిపిస్తున్నది. కాకపోతే ఇది తెలంగాణ మీద ప్రేమతో కాదు, తమిళనాట ఓట్ల రాజకీయం కోసం తెలంగాణ చెవిలో కాలీఫ్లవర్ పెట్టేందుకు కేంద్ర సర్కారు చెప్తున్న కథ.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మన రైతుల బీడు భూములను తడపాల్సిన గోదావరి జలాలను ఇప్పుడు తమిళనాడులోని కావేరీ నదిలో పోసి భవిష్యత్తులో హిమాలయాల్లో పుట్టిన నదుల నుంచి నీళ్లను తెచ్చి తెలంగాణలోని గోదావరిలో పోస్తారట! ఇది విన్న తెలంగాణలోని చిన్న పిల్లగాడైనా ‘చెప్పినవు తీ’ అంటారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ‘సరే మరి, తీసుకుపోండి’ అని ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది. ‘చరిత్ర పునరావృతం అవుతుంది’ అన్నట్టు నాడు మద్రాసుకు తాగునీటి పేరిట మానవతా దృక్పథం అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు పోతిరెడ్డిపాడుతో కృష్ణాజలాలను కొల్లగొట్టారు. ఇప్పుడు హిమాయల కథలు చెప్పి తెలంగాణకు ప్రాణాధారమైన ప్రాణహిత, ఇంద్రావతి జలాల్ని కొల్లగొట్టే కుతంత్రానికి కేంద్రం సిద్ధమైంది. అప్పుడైనా, ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ గడ్డకు ఇలాంటి చారిత్రక ద్రోహాలు జరుగుతుండటం కీలకమైన, చరిత్ర చెప్తున్న సత్యం. గోదావరి-కావేరీ అనుసంధాన ప్రతిపాదన ఇప్పటిది కాదు, కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ కేంద్రం ఒత్తిడి చేసింది. కానీ, గోదావరిలో మిగులు ఉంటే తప్ప కుదరదని నాడు కేసీఆర్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్ర తివాచీ పరిచింది. మరి, కేంద్ర సర్కారు చాకచక్యం అనుకుందామా? కాళేశ్వరం ప్రాజెక్టును కాటిలో కలిపేందుకు రేవంత్ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహం అనుకుందామా!!
ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలోనూ పాలకులు గోదావరిపై అనేక ప్రాజెక్టులు ఈ చందమామ కథలు చెప్తూనే కట్టారు. అదిగో గోదావరిజలాలు అంటూ లాలపాడుతూ వేల కోట్ల రూపాయలు గోదావరిలో కుమ్మరించారు. కట్టు కథలు చెప్పారు. అసలు ఈ ప్రాజెక్టులతో గోదావరి జలాలు తెలంగాణ బీడు భూముల్లోకి పారేవికావని ఆనాటి పాలకులకు తెలుసు. పదవులు పంచుకున్న కాంగ్రెస్ నేతలు జనానికి చెప్పుకునేందుకు ప్రాజెక్టుల పేర్లు, పంచుకునేందుకు టెండర్లు ఉంటే చాలనుకున్నారు. అందుకే తెలంగాణ ఏర్పడేనాటికి ప్రధాన గోదావరిపై శ్రీరాంసాగర్ తప్ప ఏడాది పొడవునా నీళ్లు పారే ప్రాణహిత, ఇంద్రావతిపై ప్రాజెక్టులే నిర్మించలేదు. గోదావరిలో నూటికి 49 శాతం నీళ్లు ఈ రెండు ఉప నదుల నుంచే (జీ-9 ప్రాణహిత-25.96, జీ-11 ఇంద్రావతి-22.93) వస్తున్నాయంటే ఇవి ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. పైగా పద్నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుతో కట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు పారక శిథిలమైన కాకతీయ కాల్వ ఇప్పటికీ మన రైతుల జ్ఞాపకంలో పదిలంగానే ఉంది. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తెలంగాణకు ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులే శరణ్యమని గుర్తించి ప్రాణహిత జలాలను వాడుకునేందుకు కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, దేవాదుల ప్రాజెక్టుకు జీవం పోసేందుకు సమ్మక్క (తుపాకులగూడెం) బరాజ్ నిర్మించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఈ రెండు ఉప నదుల కలిసిన తర్వాత వచ్చే ఇచ్చంపల్లి దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టి గోదావరి జలాలను తమిళనాడులోని కావేరీకి తన్నుకుపోతామని చెప్తున్నది.
అసలు దేశంలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల రూపకల్పన వెనక సదుద్దేశం ఉంది. కానీ మోదీ ప్రభుత్వం దానిని ఉల్లంఘించి రాజకీయాల కోసం వాడుకుంటున్నది. వాస్తవానికి హిమాలయాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నదీ జలాలను 20 శాతం కూడా వాడుకోవడం లేదు. 80 శాతం వరకు సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే 80 శాతం నీళ్లను వాడుకోని బ్రహ్మపుత్ర నది నుంచి నీళ్లను మహానదిలోకి తీసుకువచ్చి, అక్కడ మిగులు జలాలను గోదావరికి తరలించి, గోదావరిలో మిగిలిన నీటిని కృష్ణా ఆపై పెన్నా అటు నుంచి కావేరీకి తరలించాలి. కానీ మోదీ ప్రభుత్వం తమిళనాడులో వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు ఉండటంతో హడావుడిగా తల వదిలి తోకను పట్టుకుంది. గోదావరి నుంచి కావేరీకి నీళ్లు తీసుకుపోతానంటున్నది. భవిష్యత్తులో గోదావరికి నీళ్లు తెస్తానంటుంది. ఇది సాధ్యమా? దీనికి ఎన్ని దశాబ్దాలు కావాలి? తెలంగాణకు ఇది ముంతల నీళ్లు ఒలకబోసుకొని మబ్బుల దిక్కు చూసినట్టు కాకుంటే ఇంకేమైతది?
చరిత్రనే కాదు, వర్తమానంలో కూడా అసలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణకు నదీజలాల్లో చారిత్రక అన్యాయానికి బీజం పడుతున్నదని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసినందుకు తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంలో తీవ్ర అన్యాయానికి గురైందనేది నిర్వివాదాంశం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రైతుల సాగునీటి గోస పట్టించుకోకుండా మద్రాసు నగరవాసులకు తాగునీళ్లు లేవంటూ సమైక్య పాలకులు ఆవేదన చెందారు. మానవతా దృక్పథంతో కృష్ణా జలాలను ఇవ్వాలని ఏటా 15 టీఎంసీలకు ఒప్పుకొని అందులో ఐదు టీఎంసీలను తెలంగాణ ఖాతాలో వేశారు. ఇన్ని దశాబ్దాలుగా నాటి మద్రాసు, నేటి చెన్నైకి 15 టీఎంసీలు అందిన దాఖలాలు లేవు. కానీ మద్రాసు తాగునీటి పేరిట రూపుదిద్దుకున్న తెలుగుగంగ ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు అవతారం ఎత్తి ఏటా 400 టీఎంసీల కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంది. అసలు ఈ ప్రాజెక్టుకు బీజం పడిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు. మరి ఇంతటి చేదు అనుభవం ఉన్న తెలంగాణ గోదావరిలో కూడా అదే రీతిన కల్లిబొల్లి మాటలకు మోసపోయేందుకు సిద్ధమైంది. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మపుత్ర నుంచి గోదావరి దాకా ఎప్పుడు నీళ్లు తరలిస్తారో కూడా తెల్వని సమయంలో ఇప్పుడు గోదావరి నీళ్లను తరలించుకుపోతామని మోదీ ప్రభుత్వం చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకారం తెలపడమే అసలు దౌర్భాగ్యం. గత పదకొండు సంవత్సరాలుగా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్రహ్మపుత్ర నుంచి ఇచ్చంపల్లికి నీళ్లు తీసుకువస్తానని చెప్పడం నమ్మశక్యమేనా?!
తెలంగాణ సమాజం ఎంతో నమ్మకంతో అధికారమిస్తే రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన ప్రభుత్వం కండ్ల ముందు గోదావరిని ఎత్తుకుపోతామంటున్నా తలూపుతున్నది. లోపాయికారి ఒప్పందమో, మర్మం ఇంకేమైనా ఉందోగానీ తెలంగాణకు హక్కుగా ఉన్న దాదాపు 500 టీఎంసీల గోదావరి జలాలను వాడుకోవాల్సి ఉన్నా, వాటి గురించి ఆలోచించకుండా రేవంత్ ప్రభుత్వం ఇచ్చంపల్లి నుంచి నీటిని తమిళనాడులోని కావేరీకి తీసుకుపోతానంటే అభ్యంతరం చెప్పడం లేదు. పైగా ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న కారణాలే చందమామ కథలను తలపిస్తున్నాయి. మొన్న హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ టాస్క్‌ఫోర్స్ సమావేశం సందర్భంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్‌జైన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే తెలంగాణ సమాజం అంటే అంత అలుసా? అనే ఆవేదన కలుగుతుంది.