హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మృతి కేసులో పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. భూ తగాదాలే కాల్పులకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాల్పుల్లో మృతి చెందిన రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ పూర్తయ్యాయి.
కాల్పులకు లేక్ వ్యూ విల్లా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని సభ్యులు పేర్కొన్నారు. గతంలో మృతుల ఇద్దరిపై కేసులు వివాదాలుండగా.. రాచకొండ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్‌తో పాటు, పక్క పొలానికి చెందిన మట్టా రెడ్డి, మరికొంత మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రొఫెషనల్ షూటర్లే కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రెక్కీ నిర్వహించి శ్రీనివాస్‌రెడ్డి, రాఘేవందర్రెడ్డిపై కాల్పులు జరిపారని, సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొబైల్ సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ఓటీ, ఐటీసెల్, సీసీఎస్, ఎస్బీ, ఇంటిలిజెన్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. కాల్పులకు రెండు గన్స్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. వేర్వేరుగా బుల్లెట్లు గుర్తించి షార్ట్ వెపన్తో శ్రీనివాస్‌రెడ్డిని, పిస్టల్‌తో రఘుని దుండగులు కాల్చి చంపినట్లుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో సంఘటనా స్థలంలో మరో ముగ్గురు సైతం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.