ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 24: ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మా నోట్లో మట్టికొట్టిండు. పంద్రాగస్టున రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మాట తప్పిండు. ఇప్పటికైనా రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలె. వానకాలం సీజన్ ముగుస్తున్నందున రైతుభరోసాకు నిధులు కేటాయించాలి’ అని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికకు మంగళవారం రైతులు తాళం వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని.. ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అంతకుముందు తహసీల్దార్ ప్రసాద్, మండల వ్యవసాయాధికారి రాజ్‌కుమార్‌కు వినతిపత్రాలు అందజేశారు.