హైదరాబాద్ : వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావొద్దని మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలి. నీటిని పొదుపుగా వాడేలా అవగాహన కల్పించాలని అధికారులకు స్మితా సబర్వాల్ సూచించారు.
వేసవిలో నీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవిలో మిషన్ భగీరథ నీటి సరఫరా సన్నద్ధతపై సమీక్షించారు.
ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ.. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నీటి నాణ్యత, పరిమాణం విషయంలో రాజీపడొద్దని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో నీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నీటి సరఫరాకు పంచాయతీల అభిప్రాయాలు తీసుకోవాలి. రిజర్వాయర్లలో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్మితా సబర్వాల్ ఆదేశించారు.