హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందనే నిజాలన్నీ సుప్రీంకోర్టుకు పూసగుచ్చినట్టు వివరిస్తానని ఈ కేసులో నాలుగో ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య తెలిపారు. తనను అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరకు ఎవరు పంపారో, తనను ఎవరు పావుగా వాడుకున్నారో వివరంగా చెప్తానని అన్నారు. ఇన్నాళ్లకు తన పోరాటం, కృషి ఫలించిందని, ఓటుకు కోట్లు కేసును గురించిన పూర్తి నిజాలు ఏకంగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ముందు చెప్పేందుకు తనకు అవకాశం దొరికిందని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి, అప్రజాస్వామికంగా అధికారాన్ని పొందాలనుకొనే ‘ఓటు దొంగలను’ శాశ్వతంగా ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన విషయాలపై బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ఓటుకు నోటు కేసులో తాను నిందితుడిని కాదని, బాధితుడినని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కేసులో ఇరుక్కున్న వాళ్లంతా బాగుపడ్డారని, పదవులొచ్చాయని, అంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. కానీ తాను మాత్రం ఇంకా సమస్యలు, కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిపారు. ఓటుకు నోటు కేసులో తనతో పాటు నిందితుడైన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబానికి ఎలాంటి సాయం చేయలేదని తెలిపారు.
నిజానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటుందని ఆశించానని, కానీ ఆ విధంగా జరగలేదని పేర్కొన్నారు. తెరవెనుక ఏం జరుగుతున్నందో తెలియడం లేదని, ఎవరు ఎవరిని ఇరికించి ఎవరు తప్పించుకోవాలనుకుంటున్నారో తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. తనను ఈ నేరానికి ప్రోత్సహించిన వ్యక్తి టీడీపీ నుండి కాంగ్రెస్‌లో చేరి అధికారంలోకి వచ్చి తనను మోసం చేసి వదిలేశారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తాను పెద్ద పోరాటమే చేస్తానని, ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు ఎదురుపడ్డా భయపడేది లేదని స్పష్టం చేశారు.