హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ‘ప్రజాసమస్యలు, పాలకుల దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు.. సిట్ బెదిరింపులు.. నోటీసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడబోను.. చట్టపరిధిలో నా వద్ద ఉన్న సమాచారంతో జవాబిస్తా.. ఆ తర్వాత మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తేల్చిచెప్పారు. ‘ఎవరిపైనా వ్యక్తిగత దూషణలు చేయను.. చిల్లర భాషను వాడను.. వాస్తవాలు దాచను.. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపను’ అని కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంచేశారు.
హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన రెండో సిట్ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధంలేని కేటీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చి గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని తెలంగాణ భవన్ వేదికగా ఎండగట్టానని గుర్తుచేశారు. తాను ప్రెస్‌మీట్ పెట్టిన 12 గంటల్లోపే అర్ధరాత్రి 12 గంటలకు తన ఇంటికి వచ్చిన సిట్ పోలీసులు తనకు నోటీస్ ఇచ్చారని తెలిపారు. రెండు రోజుల్లో ఆధారాలతో సమాధానం ఇవ్వకుంటే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పారు. మొన్న ప్రెస్మీట్లో చెప్పిన అంశాలపై మరోసారి స్పష్టత ఇస్తున్నానని ఈ మేరకు శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశరక్షణ, అంతర్గత భద్రత, వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని చట్టమే చెప్పిందని తెలిపారు. దీనికి అనేక మార్గదర్శకాలు ఉన్నాయని, అనేకమంది అధికారులు వివిధ స్థాయిల్లో పర్యవేక్షిస్తారని, ఈ వ్యవహారం ఒక్క అధికారితో అయ్యే పనికాదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చెప్పారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం ట్యాపింగ్ చేయడం మామూలేనని ఢిల్లీలో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయని, అలాంటప్పుడు సిట్ దర్యాప్తు ఎందుకు? అనేదే తన ప్రశ్న అని పేర్కొన్నారు.
సజ్జనార్‌పై సిట్ డిమాండ్ అవాస్తవం
తాను సిట్ చీఫ్ సజ్జనార్‌పై ఆంధ్రప్రదేశ్‌లో న మోదైన కేసులపై మరో సిట్ వేయాలని డి మాం డ్ చేసినట్టు నోటీసుల్లో ఉన్న విషయం వాస్తవ విరుద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆ ప్రకటన లో కొట్టిపారేశారు. తాను చెప్పింది 2015లో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిన తర్వాత ఏపీ నాయకుల ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని, అదే ఏడాది జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఠాణాల్లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదైనట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని తెలిపారు.
అప్పుడు ఆంధ్రాలో కూడా ఒక సిట్ ఏర్పాటు చేశారని, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో సజ్జనార్ తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారిగా పనిచేశారనే అవగాహన ఉన్నదని తెలిపారు. అందుకే ఆయన ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో సిట్‌కు చీఫ్‌గా ఉండటం సమంజసం కాదని తన అభిప్రాయం చెప్పానని స్పష్టంచేశారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతిపక్ష పార్టీలోని నేతగా మరుగునపడిన ఈ విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన కనీస బాధ్యత తనపై ఉన్నదని పేర్కొన్నారు. ఇది మీకు నచ్చకుంటే వివరణ ఇవ్వండని సూచించారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రతీకార పాలనలో తాము ముమ్మాటికీ బాధితులమని, ఈ ప్రభుత్వ హయాంలోనే కేటీఆర్, హరీశ్‌రావు సహా అనేకమంది బీఆర్ఎస్ నేతలు వ్యక్తిత్వ హననానికి గురైన విషయాన్ని తెలంగాణ సమాజం ముందుంచానని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే విషయాన్ని ప్రస్తావించానని పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా నిలిచిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం ఆగదని, సిట్ నోటీసులకు బెదిరిదిలేదు.. అదిరేదిలేదని తేల్చిచెప్పారు.
‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌పై నేను ఫిర్యాదు చేసినప్పటికీ ఆయనకు పోలీసులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? నాకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా ఇవ్వలేదెందుకు?’ అని ప్రశ్నించారు. ‘కేవలం బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చే నోటీసులపై పోలీసులు ఆగమేఘాలపై రావడం.. మీడియాకు లీకులివ్వడం.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వర్కింగ్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను విచ్చలవిడిగా అరెస్టులు చేయడం.. నాలుగు గోడల మధ్య జరగాల్సిన దర్యాప్తుపై గాంధీభవన్‌లో కాంగ్రెన్ నేతలు నిత్యం లైవ్ కామెంట్రీ ఇవ్వడం దేనికి సంకేతం’అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నదని స్పష్టంచేశారు.
రేవంత్ సర్కార్ రెండేండ్ల పాలనలో చేసిన పలు కుంభకోణాల (కోల్ స్కామ్ సహా)పై సిట్ వేయాలని తాను డిమాండ్ చేశానని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పోలీసు అధికారులు పావులుగా మారవద్దని సలహాలు ఇచ్చిన విషయాన్ని ఉటంకించారు. సిట్ అధికారులు అప్పటి డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులను వదిలి కేవలం డాక్టర్ ప్రభాకర్‌రావు, ఆయన కుటుంబీకులు, బంధువులు, ఆయనతో పనిచేసిన కానిస్టేబుళ్లను వేధించడం అన్యాయమనే విషయాన్ని స్పష్టంచేశానని గుర్తుచేశారు. కేవలం కొంతమంది పోలీసు అధికారుల కనుసన్నల్లో అత్యంత గోప్యంగా జరుగాల్సిన ఈ ట్యాపింగ్.. ప్రజల నోళ్లలో తరచూ నానడం ప్రమాదకరమనే హెచ్చరించానని గుర్తుచేశారు. ‘నేను సజ్జనార్ సహా ఏ అధికారి, ఏ ఒక్క రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదు.. పాల్పడను.. ఆ సంస్కృతి నాకు లేదు’అంటూ నొక్కిచెప్పారు.