వరంగల్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాకు అవకాశం కల్పిస్తే కోతుల బెడదను నివారిస్తా.. కోతులను తరిమికొట్టేందుకు వాడకో కొండెంగను తెచ్చిపెడతా.. రాత్రిపగలు అన్న తేడాలేకుండా కోతులను కొట్టేందుకు పంచాయతీ నుంచి కొందరిని రక్షణగా పెడతా.. కోతులకు పునరుత్పత్తి జరకుండా హిమాచల్‌ప్రదేశ్‌లో అమలు చేసినట్టు వాటికి కు.ని. ఆపరేషన్ చేయిస్తా.. కోతుల నివారణ కోసం గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి నిధులు వాడకుండా సొంతంగా ఖర్చుచేస్తా.. ఇవీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఇచ్చిన హామీల వర్షం. మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర హామీలతో పలువురు అభ్యర్థులు ప్రజల ముందుకొస్తున్నారు. జిల్లాలు, ఊళ్లు అనే తేడా లేకుండా ఈసారి ప్రచారంలో ఇలా వానరసేనతో అభ్యర్థులు యుద్ధానికే సిద్ధమయ్యారు. కోతుల నివారణే ప్రధాన ఎజెండాగా అభ్యర్థులు ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. దీంతో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల కంటే కోతుల బెడద నివారణే ప్రధాన ఎజెండాగా మారింది. 2022 అంచనా ల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల కోతులు ఉన్నట్టు అధికారుల అంచనా. ఆ సంఖ్య ఇప్పుడు మూడింతలు పెరిగి కోటికి చేరి ఉంటుందని అంచనా. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడాలేకుండా కోతులు ఇల్లు పీకి పందిరేస్తున్నాయి. ఈ మేరకు ఎన్నో గ్రామాల్లో ‘కోతుల నివారణ కమిటీ’లు ఏర్పాటయ్యాయి. కోతుల దాడిలో గాయాలపాలై గత అక్టోబర్, నవంబర్ నెలల్లోనే వరంగల్ ఎంజీఎం దవాఖానకి 2,178 మంది వచ్చారంటే కోతుల బెడదకు అద్దంపడుతున్నది.
పలు గ్రామాలు, పట్టణాల్లోని జనావాసాల్లో ఎటుచూసినా కోతులే దర్శనమిస్తున్నాయి. అటు పంట పొలాలనూ నాశనం చేసి, రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, మకజొన్న, పల్లి, కంది, సోయా, శనగ, వేరుశనగ ఇలా ఆహార పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయి. మొదట్లో కోతులు పత్తి చేను జోలికి వెళ్లకపోయేది. ఇప్పుడు పత్తిగూడు కట్టే దశలో కాయల్ని కొరికి పారేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రకృతి వైఫరీత్యంతో వచ్చే నష్టంకన్నా కోతుల మందపడి చేసే నష్టమే ఎక్కువగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ దిగుబడులు తగ్గడానికి కోతుల బెడత కూడా కొంత కారణమని తెలుస్తున్నది.
మైదాన ప్రాంతాల్లోని గ్రామాలే కాకుండా ఏజెన్సీ, అటవీ ప్రాంతాల సమీప పంచాయతీ ఎన్నికల్లో కోతుల నివారణ డిమాండ్ తెరమీదికి వస్తున్నది. అత్యధిక అటవీప్రాంతం ఉన్న ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో తీవ్రమైన కోతుల బెడదను నివారించాలని ప్రజాసంఘాలు గ్రామాల్లో కమిటీలు వేశారు. గత అక్టోబర్ 13న, 17న కోదల బెడదను నివారించాలని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందించారు. ములుగు మండలం రాయినిగూడెం, సర్వాపురం గ్రామాల్లో నవంబర్ 3న కోతుల నివారణకోసం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రాలు సమర్పించారు. మల్లంపల్లిలోనూ గ్రామ కోతుల నివారణ కమిటీ ఏర్పడింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో జనాభా కన్నా కోతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఓటర్ల కన్నా కనీసం మూడు రెట్లు కోతులు అధికంగా ఉన్నాయి. గ్రామంలో 5,600 పైచిలుకు ఓటర్లు ఉంటే.. కోతులు 16 వేల పైచిలుకు ఉంటాయని గ్రామస్థులు చెప్తున్నారు. గ్రామంలో కోతుల బెడదను నివారిస్తారనే నమ్మకం కలిగించిన వారికే తాము ఓట్లు వేస్తామని గ్రామస్థులు తెగేసి చెప్తున్నారు. తమకు కొత్త రోడ్లు, ఇతర అభివృద్ధి పనులపై పట్టింపులేదని.