హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : జాతీయ పార్టీల మూకుమ్మడి రాజకీయ కుట్రలు భగ్నమయ్యాయి.. తెలంగాణ ఆడబిడ్డ 165 రోజులు కారాగారవాసం నుంచి బయటికి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 20 నెలలపాటు విచారణ జరిపి.. 493 మంది సాక్షులను, 57 మంది నిందితులను ప్రశ్నించి.. 50 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినా ఇప్పటివరకు తేల్చిందేమీ లేదని విచారణ సందర్భంగా సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టు తలంటింది. మెసేజ్లు డిలీట్ చేయడం, ఫోన్ ఫార్మాట్ చేశారని చెప్పడం తప్ప ఇంకా ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపెట్టాలని నిలదీసింది. కేవలం ఆరోపణలతో ఒక ఆడబిడ్డను ఎన్నాళ్లు జైలులో ఉంచుతారని ప్రశ్నించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని 45వ సెక్షన్ ప్రకారం మహిళను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడం, ఈడీ దర్యాప్తు పూర్తి కావడం, మహిళకు ఉన్న ప్రత్యేక వెసులుబాటు దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. కానీ, కవితకు బెయిల్ మంజూరైన ఐదు నిమిష్లాలోనే కాంగ్రెస్, బీజేపీ విషం కక్క డం మొదలుపెట్టాయి. ఆయా పార్టీల నేత లు ఏకంగా కోర్టు తీర్పునే తప్పుబట్టారు. వాస్తవానికి బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక బీజేపీ, కాంగ్రెస్ రెం ండ్లుగా ఆడబిడ్డను వేధిస్తూనే ఉన్నాయి. విచారణ సంస్థల కన్నాముందే 2022 ఆగస్టు 21న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పేరును బీజేపీ నేతలు ప్రస్తావించడమే ఇందుకు ఉదాహరణ.
నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు ఈడీ, సీబీఐ విచారణ పేరుతో వెంటాడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ విష ప్రచారంతో వేధించాయి. విచారణకు పిలిచిన ప్రతిసారీ సహకరించినా, ఆధారాలన్నింటినీ సమర్పించినా దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టలే దు. ఈ ఏడాది మార్చి 15న అక్రమంగా అరెస్ట్ చేశాయి. రెండేండ్లుగా రాజకీయంగా ఎన్నికుట్రలు, కుత్రంతాలు చేసి నా.. 165 రోజులుగా జైలులో ఉంచి శారీరకంగా, మానసికంగా ఎంత హింసించినా కవిత మొక్కవోని దీక్షతో నిలబడ్డారు. రాజకీయ కక్షతోనే తనను కేసులో ఇరికించారని న్యాయస్థానంలో గట్టిగా పోరాడారు. చివరికి న్యాయదేవత సాక్షిగా గెలిచి.. బయటికి వచ్చారు.