RS Praveen Kumar | ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్రశ్నిస్తున్న గొంతులు నొక్కడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకారేచ్ఛతో రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం నాడు నిర్వహించిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు.
దొంగ చేతికి ఇంటి తాళాలు ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో .. ఇప్పుడు రాష్ట్రాన్ని రేవంత్ చేతిలో పెట్టడం వల్ల అంతే నష్టం జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. 89 కేసులు ఉన్న, ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రానికి నష్టం జరగక ఏమవుతుందని వ్యాఖ్యానించారు. ఏదైనా ఉద్యోగం ఇచ్చే ముందు ఆ అభ్యర్థి గుణగణాలు చూస్తారు .. పాత చరిత్ర పరిశీలిస్తారు
.. కానీ రేవంత్ చరిత్ర అంతా తెలిసిందే అయినప్పటికీ ఆయన చేతిలో హోం శాఖ ఉందని తెలిపారు. సెక్రటేరియట్లో లంకెబిందెలు ఉన్నాయని వచ్చానని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు.
♦️ కేటీఆర్ గారిపై పెట్టిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తుఫెల్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.
♦️నా 26 ఏళ్ల పోలీసు సర్వీసులో ఇలాంటి చెత్త కేసు ఎప్పుడూ చూడలేదు.
♦️ఫార్ములా ఈ రేస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదు. హైదరాబాద్‌ను ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా @KTRBRS గారు ఫార్ములా ఈ రేసును… pic.twitter.com/efDRte4qdU
— BRS Party (@BRSparty) June 15, 2025
రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కేటీఆర్ పోరాటం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఇప్పటి వరకు కేటీఆర్‌పై 14 కేసులు పెట్టారని.. ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ కు నడుచుకుంటూ వస్తే కూడా కేసు పెట్టారని గుర్తుచేశారు. కేటీఆర్ శ్వాస తీసుకుంటే కూడా కేసులు పెడుతున్నారని.. కేటీఆర్ పై పెట్టిన కేసుల్లో నాలుగు కేసులను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఒకే అంశం మీద కేటీఆర్ పై రెండు ఎఫ్ఐఆర్లు పెట్టారని.. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇలా ఏ రూల్‌బుక్‌లో ఉందని నిలదీశారు. చాలామంది పోలీసు అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవడం లేదని, కేటీఆర్‌పై ప్రతీకారంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసులు పెడుతోందని విమర్శించారు. కేటీఆర్‌పై పెట్టిన ఫార్ములా ఈ కార్ రేసు కేసు తుపేల్ కేసు అని అన్నారు. తన 26 ఏండ్ల పోలీసు సర్వీసులో ఇలాంటి చెత్త కేసు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి ఒక వ్యక్తికి లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని.. అలా కేటీఆర్ ఎవరికీ డబ్బులు ఇస్తూ దొరకలేదని చెప్పారు. ఫార్ములా ఈ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా హైదరాబాద్‌కు కేటీఆర్ ఫార్ములా ఈ రేసు తీసుకొచ్చారని తెలిపారు. హైదరాబాద్ నగరానికి పెట్టుబడుల కోసమే ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ జరిగిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు మొబిలిటీ వ్యాలీ తెచ్చారని అన్నారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు ట్రాక్ లేకున్నా 9వ ఫార్ములా ఈ కార్ రేసు 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిందని తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ నగరానికి రూ.760 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులు రేవంత్ రెడ్డి వద్దకు వచ్చారని.. కానీ ఏం జరిగిందో రేవంత్ రెడ్డి పదో ఎడిషన్ ఫార్ములా ఈ రేసును నిర్వహించలేదని చెప్పారు.
కర్ణాటకలో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటలో సీపీ, 9 మంది పోలీసులను సస్పెండ్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పోలీసులు ర్యాలీ వద్దని చెప్పినప్పటికీ అక్కడ ర్యాలీ తీశారని.. చివరకు వారినే బలి పశువులను చేశారని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుగా కేటీఆర్ అధికారులపై నెపం నెట్టలేదని అన్నారు. తానే ఆదేశాలు ఇచ్చినట్లుగా ధైర్యంగా చెప్పారని తెలిపారు. ఇలాంటి నేతను ఎక్కడా చూడలేదని చెప్పారు. తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా కేటీఆర్ నిజాలు చెప్పారని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ రేసు సంస్థ ఖాతాకు డబ్బు పంపించారని, ఇది పూర్తి చట్టబద్ధంగా జరిగిందని తెలిపారు. ఇండియా ఓవర్సీస్ బ్యాంకు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే నడుచుకుందని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసు కంటిన్యూ అయ్యి ఉంటే మొబలిటీ సంస్థలు తెలంగాణకు వచ్చేవని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఈ రేసుతో కేటీఆర్ అకౌంట్లోకి ఒక్క పైసా ప్రభుత్వ సొమ్ము రాలేదని తెలిపారు. ఫార్ములా ఈ రేసు నుంచి డబ్బులు కేటీఆర్ అకౌంట్లోకి రాలేదని.. నిజాయితీగా హెచ్ఎండీఏ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమన్నానని కేటీఆర్ చెప్పారని తెలిపారు.