మహబూబ్‌నగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మె ల్యే అనిరుధ్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే తాను కూడా సీఎం అవుతానని చెప్పారు. జడ్చర్ల నియోజకవర్గానికి రూ.5 వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. శుక్రవా రం మహబూబ్‌నగర్‌లో మాట్లాడిన అనిరుధ్‌రెడ్డి ‘ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేను. ఇంకో రెండుసార్లు గెలిపిస్తే.. నేను కూడా సీఎం అభ్యర్థినైత. కాంగ్రెస్‌లో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటది. ప్రాంతీయ పార్టీల్లో ఫ్యామిలీ మెంబర్సే సీఎం అయితరు. కాంగ్రెస్‌లో అందరికీ అవకాశం ఉంటది’ అని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను కలిసి వచ్చిన నేపథ్యంలో అనిరుధ్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఎమ్మెల్యేలు అయితేనా కదా మంత్రులయ్యేది!
సీఎం రేవంత్‌పై అనిరుధ్‌రెడ్డి పరోక్ష విమర్శలు గుప్పించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ‘కొడంగల్ చూశారా.. ఎంత బాగా డెవలప్ అవుతున్నది. రేవంత్‌రెడ్డిని గెలిపించుకున్నందుకు ఎంత అభివృద్ధి జరుగుతున్నది. అట్లనే నన్ను ఇంకో రెండుసార్లు గెలిపిస్తే.. నేను కూడా సీఎం అభ్యర్థినైత. రెండు, మూడుసార్లు గెలిస్తే ఎవరికైనా అవకాశం వస్తది’ అని చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతున్నదని విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలకు నిధు లు ఇవ్వకపోతే పనులెలా చేస్తామని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు అయితేనే కదా మంత్రులు అయ్యేదని నిలదీశారు. కాబట్టి మంత్రుల కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్టుగా ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాల్సిన అవసరమున్నదని అనిరుధ్‌రెడ్డి కోరారు.