హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కానీ వరద విపత్తులో హైడ్రా పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మూసీ ఉగ్రరూపం దాల్చి ఆ వరదల్లో పరీవాహక ప్రాంతాల్లోని కాలనీలకు కాలనీలే మునిగి పోతుంటే అక్కడ ప్రజలను కాపాడటంలో హైడ్రా పూర్తిగా విఫలమైంది. శుక్ర, శనివారాల్లో నగరాన్ని ముంచెత్తిన మూసీనది వరదలో చిక్కుకున్న పరీవాహక ప్రాంత ప్రజలను కాపాడటంలో, సహాయక చర్యలు చేపట్టడంలో హైడ్రా ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించింది.
వరదల్లో చిక్కుకున్న ప్రజలను వారి మానాన వారిని వదిలేసి డ్రోన్ల ద్వారా విజువల్స్ తీసుకోవడం, ఆహారం అందించడంలో మునిగిపోయింది. నార్సింగి వద్ద ఓఆర్ఆర్తోపాటు సర్వీస్ రోడ్లపై మూసీ వరదను చిత్రీకరించే పనుల్లో హైడ్రా సిబ్బంది తలమునకలయ్యారు. కొందరు సిబ్బంది బ్రిడ్జ్పైనుంచి కింద వరద ప్రవాహాన్ని చూడడంలో బిజీగా ఉంటే మరికొందరు డ్రోన్ చిత్రాలు చూడటంలో నిమగ్నమయ్యారు.
శుక్రవారం రాత్రి మూసీ వరద సిటీని ముంచెత్తిన క్రమంలో హైడ్రా ఎక్కడికి పోయిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. మూసీ పరీవాహక ప్రాంతానికి వరద ముప్పు ఉందన్న ప్రచారం చేయడానికి ప్రభుత్వం హైడ్రాను వాడుకున్నదని నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టేందుకు అక్కడ నివసిస్తున్న వారిని ఎలాంటి అడ్డంకులు లేకుండా, వారంతట వారే అక్కడి నుంచి తరలిపోయేలా చేయడంలో భాగంగా వరదను, వర్షాన్ని రేవంత్ సర్కారు వాడుకున్నదని చెప్తున్నారు. అందులో భాగంగానే హైడ్రా డ్రోన్ల ద్వారా మూసీ వరదలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతోపాటు, మీడియాకు విడుదల చేశారని అంటున్నారు.
జీహెచ్ఎంసీతోపాటు పోలీసు విభాగాలు డ్రోన్లతో వరదలు చిత్రీకరిస్తుంటే హైడ్రా కూడా సహాయక చర్యలు నిలిపివేసి వరద చిత్రీకరణలో బిజీగా మారడం ఈ అనుమానాలకు తావిస్తున్నది. హైడ్రా సిబ్బందిలో చాలామందికి విపత్తు నిర్వహణపై పెద్దగా అవగాహన లేదని ఓ అధికారి చెప్పడం గమనార్హం. గతంలో జీహెచ్ఎంసీలో విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేకంగా అధికారులు ఉండేవారు, కానీ హైడ్రాలో ఔట్ సోర్సింగ్ వారికి ఈ బాధ్యతలు అప్పగించారు. దీంతో మూసీ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతోనే బాధితులను రక్షించే ప్రయత్నాలు జరిగాయని స్థానికులు చెప్తున్నారు. మూసీ వరద ముంచెత్తిన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పర్యటించారు. సహాయక చర్యలను పరిశీలించారు.