హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో పేదల ఇండ్ల కూల్చివేతపై నిప్పులు చెరిగింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడం ఏమిటని, అంత అత్యవసరంగా కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా బాధితుల గోడు వినకుండా వారి ఇండ్లను ఏకపక్షంగా ఎలా కూలుస్తారని, ఒకవేళ అవి అక్రమ నిర్మాణాలే అయినా కూల్చివేతకు ముందు నిబంధనలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది.
హైడ్రా చేపట్టే ఎలాంటి చర్యలైనా చట్టానికి లోబడే ఉండాలని ఎన్నిసార్లు స్పష్టం చేసినా అధికారులకు అర్థం కాదా? అని మండిపడింది. ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కూడా హైడ్రా అధికారులకు కనువిప్పు కలగడం లేదని ధ్వజమెత్తింది. ఐలాపూర్ తండాలో కూల్చివేతలపై యధాతథ స్థితి (స్టేటస్కో) కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శనివారం తెల్లవారు జామున హైడ్రా చేపట్టిన కూల్చివేతలను తక్షణమే అడ్డుకోవాలంటూ ఐలాపూర్ తండాకు చెందిన గజ్జా రంగారావు సహా 13 మంది దాఖలు చేసిన అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి తన ఇంటి వద్దే విచారణ చేపట్టి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది రామవరం చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐలాపూర్ తండాలోని 119 సర్వే నంబర్లో దాదాపు 3,500 మంది పేదలు నివసిస్తున్నారని, వారి పూర్వీకులు 1956 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటూ అక్కడే గృహాలను నిర్మించుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఆ ఇండ్లలో నివసిస్తున్నవారంతా విద్యుత్తు బిల్లులు, నీటి పన్నులు చెల్లిస్తున్నారని, అయినప్పటికీ హైడ్రా సిబ్బంది హఠాత్తుగా పోలీసుల రక్షణతో వచ్చి ఏకపక్షంగా ఆ ఇండ్ల కూల్చివేతలు చేపట్టారని తెలిపారు.
ఈ కూల్చివేతలకు ముందు బాధితులకు చట్టప్రకారం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ.. హైడ్రా చర్య రాజ్యాంగంలోని 14, 21, 300ఏ అధికరణలతోపాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. బుల్డోజర్లు, క్రేన్లతో హైడ్రా చేపట్టిన కూల్చివేతల ఫొటోలను, వీడియోలను న్యాయమూర్తికి అందజేశారు. ఐలాపూర్‌లో తండాలో నివసిస్తున్నవారంతా నిరక్షరాస్యులైన నిరుపేద కూలీలని, వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా బాధితులకు ఇవ్వకుండా హైడ్రా బలప్రయోగానికి దిగిందని, వారి గోడు వినకుండా తెల్లవారుజామున ఇండ్లను కూల్చేసి రోడ్డున పడేయడం జీవించే హకును కాలరాయడమేనని వివరించారు.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఐలాపూర్ తండాలో ఇండ్ల కూల్చివేతకు ముందు బాధితులకు హైడ్రా నోటీసులు జారీ చేయకపోవడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది. తెల్లవారుజామున 2 గంటలకు హఠాత్తుగా కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఐలాపూర్ తండాలో ఇండ్ల కూల్చివేతలను తక్షణమే నిలిపివేసి అక్కడ యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇండ్ల కూల్చివేతకు ముందు అధికారులు కచ్చితంగా నిబంధనలను పాటించాలని, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఇకపై ఎలాంటి కూల్చివేతలు చేపట్టాలన్నా బాధితులకు ముందే నోటీసులు జారీచేసి గోడు వినాలని, చట్టపరమైన విధానాలు పాటించకుండా హైడ్రా తీసుకునే చర్యలను, సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టడాన్ని అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రతివాదులైన హైడ్రాతోపాటు రంగారెడ్డి కలెక్టర్, అమీన్పూర్ తహసీల్దార్, పోలీసులకు నోటీసులు జారీచేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంటూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది.