హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో ఎట్టకేలకు వ్యక్తిగతంగా హాజరైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ న్యాయస్థానాన్ని బేషరతుగా క్షమాపణలు కోరారు. కోర్టు అంటే గౌరవం ఉన్నదని, బాచుపల్లిలో వరదలు ముంచుకురావడంతో అకడికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ కారణంగా గత నెల 27న వ్యక్తిగతంగా విచారణకు రాలేకపోయానని వివరించారు. హైడ్రా కమిషనర్ క్షమాపణను హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. తదుపరి విచారణకు హాజరునుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట పరిధిలో కోర్టు వివాదంలో ఉన్న స్థలంపై యథాతథస్థితిని కొనసాగించాలని, అక్కడ ఎటువంటి మార్పులు చేయరాదని జూన్ 12న హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు దికరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
ఇంతకుముందు జరిగిన విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారంట్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరైన రంగనాథ్ క్షమాపణ చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని చెప్పారు. అకడి స్థలం ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకున్నారని వివరించారు. ఇది కోర్టు ధికార చర్య కిందకు రాదని చెప్పారు. ఇందుకు ఫెన్సింగ్ ఏర్పాటు నిమిత్తం ప్రైవేటుసంస్థకు అప్పగించారని తెలిపారు. కౌంటరుతోపాటు ఫొటోలను పరిశీలించాలని కోరారు.
గత విచారణకు హాజరుకావాలని రంగనాథ్ భావించారని, అయితే, వరదల నేపథ్యంలో ఆయా ప్రాంతాల పర్యవేక్షణకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. హైకోర్టు కల్పించుకుంటూ.. తాము ఉత్తర్వులు జారీచేసే నాటికి, ఆ తర్వాత పరిస్థితులకు తేడా ఉందో లేదో చెప్పాలని అడిగింది. ఇదే కోర్టు ధికరణ పిటిషన్‌లోని కీలక విషయమని తెలిపింది. పిటిషనర్ సమర్పించిన ఆధారాల ప్రకారం అకడి పరిస్థితిని పూర్తిగా మార్చేశారని, గుర్తుపట్టలేని విధంగా మార్పు చేసినట్టుగా ఉందని పేర్కొంది. దీనిపై సమగ్ర విచారణ చేస్తామని ప్రకటించింది. విచారణను 18కి వాయిదా వేసింది. అదేరోజు సివిల్ కోర్టు ఉత్తర్వులపై కూడా విచారణ చేస్తామని వెల్లడించింది.