Musi River | హైదరాబాద్ సిటీబ్యూరో/మలక్‌పేట, అక్టోబర్ 26 ( నమస్తే తెలంగాణ ) : మూసీ నిర్వాసితులు ఓ వైపు తమ ఇండ్లను కూల్చొద్దంటూ వేడుకుంటున్నా.. రేవంత్ సర్కారు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. చడీచప్పుడు లేకుండా కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ నిర్వాసితులు తమ ఇండ్లను వాళ్లే కూల్చుకుంటున్నారని ప్రగల్భాలు పలికారు. కానీ, నాడు, నేడు ఆ కూల్చివేతలన్నీ సర్కారే చేసిందనడానికి అధికారులు అక్కడ ఉండి కూల్చివేతల ప్రక్రియను చేపట్టడమే నిదర్శనం. నాడు మూసానగర్, శంకర్‌నగర్‌లో 150 ఇండ్లను కూల్చిన ప్రభుత్వం.. తాజాగా మూసారంబాగ్లో శనివారం మూసీ రివర్‌బెడ్‌లోని 25 ఇండ్లను నేలమట్టం చేసింది. ఇండ్ల పైకప్పులు తొలిగించి గోడలను బద్ధలు కొట్టించారు. ఎన్ని కూలగొడుతున్నాం? ఏ మేర కూలగొట్టాం? ఇంకా ఎన్ని కూల్చాల్సినవి ఉన్నాయనే లెక్కలు అధికారులు అక్కడే ఉండి రాసుకోవడం విశేషం. కండ్లముందే ఇండ్లు భూస్థాపితమవుతుంటే దిక్కుతోచక స్థితిలో బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.
చెదిరిన పేదోడి గూడు..
మూసారంబాగ్ సాయిలు హట్స్‌లోని వారివి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. ఏండ్ల తరబడి అక్కడే నివాసముంటున్నారు. ఈ ఇండ్లపై అధికారులు గతంలోనే రెడ్‌మార్క్ వేశారు. అప్పటి నుంచి ఇండ్లు కూలగొడితే తమ బతుకులు ఏమవుతాయోనని నిద్రలేని రాత్రులు గడిపారు. చివరకు శనివారం ఇండ్లను కూల్చివేశారు. డివిజన్ పరిధిలో మొత్తం 109 నిర్మాణాలు రివర్ బెడ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాయిలు హట్స్‌లో 25 నిర్మాణాలు, అంబేద్కర్ హట్స్‌లో 17 నిర్మాణాలు, ఆదిజాంబవంతుని హట్స్, అజయ్ హట్స్‌లో 26 నిర్మాణాలు ఉండగా, సాయిలు హట్స్‌లో 5, అజయ్ హట్స్‌లోని 20 ఇండ్లను కూల్చివేయించి బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ ఇండ్లతో వారికి ఏండ్లుగా ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బాధాతప్త హృదయాలతో సామగ్రి తీసుకెళ్లారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించినట్టు అధికారులు చెబుతున్నారు.
నిర్వాసితుల్లో భయాందోళన..
మూసీ రివర్‌బెడ్‌లోని నిర్మాణాల కూల్చివేతలు త్వరగా పూర్తిచేయాలని సర్కారు నుంచి అధికారులకు ఆదేశాలు రావడంతో ఆ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మొదటి దఫా మూసానగర్, శంకర్‌నగర్‌లో 150 ఇండ్లను కూల్చివేసిన సంఘటనపై సర్వత్రా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ప్రజలు తీవ్రంగా విమర్శించారు. బాధితులతో చర్చించకుండా ఇండ్లను కూల్చడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కూల్చివేతలపై సర్కారు కొంత వెనకడుగు వేసినట్టు నటించింది. కానీ, తాజాగా కూల్చివేతల ఘటనతో మళ్లీ మూసీ నిర్వాసితుల్లో భయాందోళన నెలకొన్నది. రివర్‌బెడ్‌లో అధికారుల లెక్కల ప్రకారం 2,166 నిర్మాణాలు, బఫర్‌జోన్‌లో 7,851 నిర్మాణాలు, 200 ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. మూసీ బాధితులంతా బస్తీల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి కూల్చివేతలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. కలెక్టర్లకు, మంత్రులకు తమ ఇండ్లు కూల్చొద్దని వినతి పత్రాలు ఇస్తున్నారు. అయినా పేదోడి బాధను పట్టించుకోని రేవంత్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నది.
సీఎంగారూ.. ఇప్పుడేమంటారు?
మూసీ నిర్వాసితులే తమ ఇండ్లను కూల్చుకున్నారంటూ గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన అంతా అబద్ధమని తేలిపోయిందని బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గతంలో ముసానగర్, శంకర్‌నగర్ ఇండ్లను కూల్చివేయడానికి నియమించిన లేబర్‌కు సర్కారు నుంచే డబ్బులు అందాయని, ఇప్పుడు అధికారులు దగ్గరుండి ముసారంబాగ్ కూల్చివేతలను చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం పేదోళ్ల జోలికి రావొద్దని సూచించారు. మూసీ అభివృద్ధి పేరుతో నిరుపేదల ఇండ్లు కూల్చితే.. సహించేది లేదంటూ హెచ్చరించారు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, నగరంలో తమ ఇంటికి సమానమైన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.