Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్/అమీన్పూర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వినాయకుడి పూజ చేసుకుని హాయిగా ని ద్రించిన ఆ కుటుంబాలకు మరికొన్ని గంటల్లోనే హైడ్రా రూపంలో గండం వచ్చి పడింది. ప్రజాపాలనలో సామాన్యుడి గూడుపై సర్కారు దాడి మొదలైంది. తెల్లవారుజామునే నిద్రలేవకముందే ఇండ్లపై బుల్డోజర్లతో దాడులు చేయిస్తూ ప్రభుత్వం హైడ్రామాలు చేస్తోం ది. ప్రభుత్వం, హైడ్రాపై బాధితులు తిరగబడుతూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఎఫ్టీఎల్లో నిర్మాణం జరుగుతున్న వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటామని హైడ్రా చెబుతూనే ఇండ్లలో నివాసముంటున్న వారిపై విరుచుపడుతున్నది. కూల్చివేతల్లో హైడ్రా ప్రదర్శిస్తున్న ద్వంద్వ నీతిపై నగర ప్రజలు మండిపడుతున్నారు. ఆదివారం ఉదయం మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిసరాలలో ఉద్రిక్తతల నడుమ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేట్‌లోని కత్వ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థ ఎఫ్టీఎల్, బపర్ జోన్లో నిర్మించిన 13 విల్లాలను కూల్చేశారు. భారీ పోలీసుల బందోబస్తు నడుమ మాదాపూర్, దుండిగల్‌లోని సున్నం చెరువు, కత్వ ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న డ్రైవ్ ఇన్, రెండు బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు పొట్టకూటి కోసం వచ్చిన సామాన్యుల షెడ్లను కూడా హైడ్రా కూల్చేసింది. ఓ వైపు వర్షం, మరో వైపు ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారు. పండగ పూట వర్షంలో పిల్లలను తీసుకొని ఎటుపోవాలో దిక్కుతోచక బాధితులు బిక్కు బిక్కుమంటూ కన్నీరుమున్నీరయ్యారు. ‘కేసీఆర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చారు.. నువ్వేం చేశావు.. మా బతుకులు కొట్టడానికే నువ్చొచ్చావా బాబు..’ అంటూ ఓ మహిళ సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మరో మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేస్తూ రేవంత్సర్కార్పై దుమ్మెత్తిపోశారు. రూపాయి రూపాయి కూడబెట్టి స్థలం కొనుగోలు చేసి నిర్మాణాలు చేశామని, తమను ఆకస్మాత్తుగా రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మాకు చావే శరణ్యం’అని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మా పేదల ఇండ్లు కూలగొడితే రేవంత్ నాశనాన్ని కోరుకున్నట్టేనని బాధితులు శాపనార్థాలు పెట్టారు.
మరికొంతమంది మా త్రం ప్రభుత్వ నిబంధనలు పేదలకేనా ? సంపన్నులకు వర్తించవా? అని అధికారులను ప్ర శ్నించారు. హైడ్రా ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు చేస్తుండడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దుండిగల్‌లో ఇండ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి కూల్చేసేందుకు హైడ్రా ప్రయత్నించగా బాధితులు తిరగబడ్డారు. దీంతో మరో 14 మంది కి వారం రోజులు గడువు ఇచ్చారు. అలాగే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్‌పరిధిలో ఆదివారం హైడ్రా ఆధ్వర్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఆదివారం హైడ్రా నేతృత్వంలో తహసీల్దార్ రాధా, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో కూల్చివేతలు చేశారు. పెద్ద చెరువు ప్రాంతంలో సర్వేనెంబర్ 323, 324, 329 గల స్థలంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీకి చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి చెందిన స్థలాలలో నిర్మించిన ప్రహరీ, షెడ్లు, రూములను నేలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నాగరాజు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, ఇరిగేషన్ డీఈ రామస్వామి సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
సంపన్నులకు వర్తించని నిబంధనలు …
మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలున్నాయని గుర్తించిన హైడ్రా ఆదివారం భారీ యంత్ర పరికరాలతో సున్నం చెరువు వద్దకు చేరుకొని కూల్చేవేతచేపట్టారు. పొట్టకూటి కొరకు ఒడిశా నుంచి వచ్చిన కూలీలు సున్నం చెరువులోని ఎఫ్టీఎల్లో రేకుల షెడ్లను నిర్మించుకున్నారు. ఉదయం 5 గంటలకు వచ్చిన హైడ్రా అధికారులు షెడ్లను ఖాళీ చేయమని చెప్పి గంట వ్యవధిలోనే ఆయా షెడ్లను కూల్చివేయడం ప్రారంభించారు. దీనిపై అక్కడున్న పేదలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ రేవంత్ సర్కారుకు పక్కనున్న ఎఫ్టీఎల్ పరిధిలోని సంపన్నుల భవనాలు, విల్లాలు కనిపించడం లేదా? పేదలపై మీ ప్రతాపమా? అంటూ మండిపడ్డారు. భారీ భవనాల్లో, విల్లాల్లో ఉంటున్న వారికి హైడ్రా ముందస్తు నోటీసులిస్తుందని, గుడిసెల్లో ఉంటున్న వారికి గంట సమయం ఇవ్వకుండా కూల్చేస్తున్నారని పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు ఎఫ్టీఎల్ నిర్మిస్తున్న రెండు భవనాలు, అక్కడ కొనసాగతున్న ఒక డ్రైవ్ ఇన్ రెస్టారెంట్, పేదలు ఉంటున్న 30కి పైగా షెడ్లను హైడ్రా కూల్చేసింది. షెడ్లను కూల్చేస్తుండటంతో బాధితులు హైడ్రా అధికారులపై తిరగబడ్డారు. తమకు హైడ్రా తీవ్రంగా అన్యాయం చేస్తుందని నిరసిస్తూ ఒక మహిళ, మరో పురుషుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయతానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు ఆందోళనకు సిద్ధం కాగా, భారీఎత్తున అదనపు పోలీసు బలగాలను రప్పించి చెదరొగొట్టారు. దీంతో ఉద్రిక్తతం నెలకొన్నది. మాదాపూర్ సున్నం చెరువు విస్తీర్ణం ఎఫ్టీఎల్తో కలిసి 29.75 ఎకరాలు, నీటిని విస్తరించి ఉన్న ప్రాంతం 15.20 ఎకరాల విస్తీరణంలో ఉంది. మిగతాది ఎఫ్టీఎల్లోకి వస్తుంది.
పిల్లలతో ఎక్కడికెళ్లాలి ?
సున్నం చెరువు వద్ద రేకుల షెడ్‌ను ఏర్పాటు చేసుకొని పదేండ్లుగా ఉంటు న్నాం. మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలున్నారు అన్న కనికరం లేకుండా షెడ్‌ను నేటమట్టం చేశారు. పొట్టకూటి కోసం ఒడిశా నుంచి వచ్చి కూలీ పని చేసుకుంటున్నాం. ఉన్నట్టుండి షెడ్‌ను కూ ల్చితే పిల్లలను తీసుకొని వర్షంలో ఎక్కడ తలదాచుకోవాలి. మాలాంటి వారికొరకు ప్రభు త్వం ఏదైనా సమకూర్చే ఆలోచన చేసిందా? నేను ఎక్కడికి వెళ్లేది. ఏమి చేసేది ?
– పద్మ, కూలీ
మా బతుకులపై కాంగ్రెస్ విషం
సున్నం చెరువు వద్ద రేకుల షెడ్డు వేసుకొని పదేండ్లుగా ఉంటు న్నాం. ఇన్ని సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కాలేదు కానీ పేదల బ్రతుకులపై విషం చిమ్ముతున్నారు. పక్కనే ఉన్న విల్లాల వారికి మాత్రం నోటీసులు ఇచ్చారు. 10 రోజులు పూర్తైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాకు మాత్రం షెడ్లను అన్యాయంగా కూల్చివేశారు. – బాబుల్, కూలీ
చావే శరణ్యం
ఆదివారం తెల్లవారుజామున హైడ్రా అధి కారులు తమ ఇంఢ్లను కూల్చివేయడంతో తమకు చావే శరణ్యమంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన బాధితులు
కేసీఆర్ తెలంగాణ తెస్తే.. నువ్వు కూలుస్తున్నవ్
కేసీఆర్ 28 రోజులో, 30 రోజులో నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే.. నువ్వేం చేశావయ్యా? మాలాంటోళ్ల ఇండ్లు, కడుపులు కొట్టడానికి వచ్చావ్. ఏదైనా మంచిపని చేసి శభాష్ అనిపించుకోవాలి. అంతేకానీ, ఇలా పేదల ఇండ్లపై పడతావా? మేం డబ్బులు ఖర్చుపెట్టుకుని కోర్టుకు వెళ్లాం. కోర్టులు ఎందుకున్నాయి? కేసు అక్కడుండగానే ఇక్కడికొచ్చి ఎలా కూలుస్తారు? మేమేమీ దొంగతనం చేయలేదు. కష్టపడి లోన్లు తెచ్చుకుని ఇండ్లు కట్టుకున్నాం.
-బాధితురాలు
ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇండ్లు కొనుగోలు చేయొద్దు
నగరవాసులు సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రధానంగా అపార్ట్మెంట్లు, వ్యక్తిగత ఇండ్లు, స్థలాలు కొనుగోలు చేసే ముందు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉందా? లేదా అని నిర్ధారించుకోవాలి. మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న నాలుగు అంతస్తులు, రెండు అంతస్తులు భవనాలు..30కి పైగా షెడ్లను అధికారులు కూల్చివేసి పది ఎకరాల చెరువు భూమిని స్వాధీనం చేసుకున్నాం. దుండిగల్ కొత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న 13 డూప్లెక్స్ విల్లా భవనాలను తొలగించి రెండు ఎకరాల చెరువును స్వాధీనం చేసుకున్నాం. అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో పద్మావతినగర్‌లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్ ప్రహరీ, రెండు సెక్యూరిటీ గదులను తొలగించాం. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేనివే కూల్చివేస్తున్నాం. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోం.
– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
పేదల పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు కనికరమే లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎందరో పేదలు నిర్మించుకున్న ఇండ్లను హైడ్రా పేరుతో అత్యంత కర్కశంగా కూల్చివేస్తున్నదంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆదివారం పోస్టు చేశారు. హైడ్రా ఇండ్లు కూల్చిన తర్వాత.. నిరాశ్రయులైన పేద లు జోరు వానలో పట్టాలు అడ్డుపెట్టుకొ ని కన్నీటిపర్యంతమవుతున్న వీడియోను ఆ పోస్టుకు జత చేశారు. ఆ పోస్టుకు వేలాదిగా వ్యూస్, పాజిటివ్ కామెంట్లతో విశేష స్పందన వస్తున్నది. కనికరం లేకుండా కర్కశంగా నిరుపేదలు నివాసముండే ఇండ్లను ఇవ్వాళ రేవంత్ సరార్ కూల్చివేస్తే.. ఆ అభాగ్యులు దికుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో తలదాచుకుంటున్నారని తెలిపారు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం.. కూల్చేదేమో నిరుపేదల ఇండ్లు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సుమారు 40,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్‌లో పేదలకు కేటాయించేందుకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ ఇండ్లను వెం టనే నిరుపేదలకు కేటాయించాలని దయ తో వేడుకుంటున్నట్టు సీఎస్‌ను కోరారు. మానవీయ దృక్పథంతో పునరావాస విధానంతో ముందుకురావాలని, పౌరులందరికీ చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి ఇండ్లు కేటాయించండి’ అంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తన పోస్టును తెలంగాణ సీఎస్‌కు ట్యాగ్ చేశారు.