హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): హైడ్రా.. ఇప్పుడీ పేరు వింటేనే పేదలు గజగజ వణికిపోతున్నారు. చెరువుల రక్షణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లక్ష్యాన్ని మరిచి పేదలపైకి బుల్డోజర్లు తోలుతున్నది. ఆక్రమణ పేరుతో గుడిసెలను చిదిమేసి వారిని రోడ్డున పడేస్తున్నది. పేదల గుడిసెలను తొక్కుకుంటూ వెళ్తున్న హైడ్రా పెద్దల వైపు చూసేందుకు సాహసం చేయడం లేదు. హైడ్రా ఏర్పాటై నేటికి సరిగ్గా ఏడాదైంది. ఈ 12 నెలల కాలం లో హైడ్రా బుల్డోజర్ల కింద నలిగి రోడ్డుపాలైన దీనులెందరో. కోర్టు స్టేలు, స్టేటస్కోలను ఉల్లంఘిస్తూ మరీ సామాన్యులపై గుడ్లురిమి చూస్తున్నది. నిరుడు జూలై 19న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులిచ్చిం ది.
జీహెచ్ఎంసీతోపాటు ఓఆర్ఆర్ లోపల వరకు 2,050 చదరపు కి.మీ మేర హైడ్రా పరిధిలో ఉంది. హైడ్రా ఈ ఏడాది కాలంలో చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించి మొత్తం 588 అనధికారిక నిర్మాణాలను తొలగించినట్టు అధికారికంగా వెల్లడించింది. మొదట్లో హైడ్రా కూల్చివేతల్లో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు, మరో రెండు నిర్మాణాలు మినహా అందరూ సామాన్యులే కావడం గమనార్హం. అక్టోబర్ 2024 తర్వాత చెరువులతో పాటు ప్రజావసరాలకు ఉపయోగపడే స్థలాలంటూ పార్కులు, రోడ్ల కబ్జాలకు సంబంధించిన నిర్మాణాలు కూల్చేసినా వాటిలో ఎక్కువ శాతం కోర్టు వివాదాల్లో ఉన్నవే. ప్రతీ సోమవారం ప్రజావాణి ప్రారంభించి అందులో వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తూ రోడ్లు, పార్కుల ఆక్రమణలు తొలగిస్తున్నది.
చెరువుల ఆక్రమణలు తొలగిస్తామని చెప్పి నా.. కొన్నిచోట్ల మాత్రం తమ ప్రతాపాన్ని హైడ్రా కనబర్చలేకపోతున్నది. జంటజలాశయాల పరిధిలో పెద్దోళ్ల ఫామ్‌హౌస్‌లు అక్రమమంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ అనేకసార్లు తన ప్రసంగాల్లో అధికారికంగానే ప్రకటించారు. పెద్దోళ్లు మురుగు వదిలితే ఆ నీటిని నగరవాసులు తాగాల్నా అని ప్రశ్నించారు. జంటజలాశయాల వైపు మాత్రం హైడ్రా బుల్డోజర్లు పోవడంలేదు. ఆగస్ట్ 18న గండిపేట ఎఫ్టీఎల్లో ఉన్నదంటూ ఓ పారిశ్రామికవేత్త నిర్మాణాన్ని కూల్చిన హైడ్రా, ఆపై అసలు 111 జీవో పరిధి తమది కానే కాదని నాలుక మడతేసింది. బడాబాబుల ఫాంహౌస్‌ల జోలికి హైడ్రా, జలమండలి, ఇరిగేషన్ అధికారులు పోకపోగా, ఎవరూ ఆ దిశగా కూడా కన్నెత్తి చూడటం లేదు.
నిరుడు ఆగస్ట్, సెప్టెంబర్‌లో హైడ్రా దూకుడుగా వ్యవహరించి హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో సామాన్యుల నిర్మాణాలను నేలమట్టం చేసింది. తన నిర్మాణం బఫర్‌జోన్‌లో ఉంటే కూల్చేయండంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరినా అది అమలుకాలేదు. కానీ ఒక సామాన్యుడు తన ఇల్లు కూల్చొద్దంటూ కాళ్లావేళ్లా పడ్డా ఆ విషయంలో ఎలాంటి కనికరం చూపడం లేదు. వారు తమ రిజిస్ట్రేషన్లు, ట్యాక్సు రశీదులు చూపించినా అవన్నీ అక్రమమే అంటూ అవసరమైతే అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయిస్తామని చెప్తున్నారు తప్పితే ఇండ్ల కూల్చివేతలు మాత్రం ఆపలేదు. తాము అన్ని పర్మిషన్లతో ఇల్లు కట్టుకున్నామని ఈఎంఐలు ఎలా కట్టాలంటూ ఒకరు, తాము ఎల్ఆర్ఎస్ కట్టామని మరొకరు, ఇలా అన్ని శాఖలు ఎన్వోసీ ఇచ్చాయని చెప్పినా ఏ మాత్రం కనికరం లేకుండా వాళ్ల ఇండ్లపైకి బుల్డోజర్లు నడిపించి కూల్చేశారు. ప్రధానంగా సున్నం చెరు వు, నల్లచెరువు తదితర చెరువులతోపాటు పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు సామాన్యుడికి తీవ్ర నష్టం మిగిల్చాయి.
సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి దుర్గం చెరువు పరిధిలో అమర్హౌసింగ్ సొసైటీలో ఉన్న నిర్మాణాలకు నెల రోజుల వ్యవధిలో నోటీసులిచ్చారు. తాను ఈ ఇల్లు కొనేటప్పుడు డాక్యుమెంట్లు న్యాయవాదికి చూపిస్తే అన్నీ సక్రమమే అని చెప్పాడని తిరుపతిరెడ్డి చెప్పారు. బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ఉన్నట్టు తాను ఆ స్థలం కొనుగోలు చేసే సమయంలో తెలియదని తిరుపతిరెడ్డి అమాయకత్వం ప్రదర్శించారు. హైడ్రా నోటీసులపై కోర్టు స్టే ఇవ్వడంతో నోటీసుల కథ అటకెక్కింది. తాను కొనే సమయంలో ఎఫ్టీఎల్లో ఉన్నదని తెలియదంటున్న తిరుపతిరెడ్డిని వదిలేసిన హైడ్రా అదే సమయంలో తాము కొనేటప్పుడు చెరువులో ఉన్నట్టు తెలిస్తే ఎందుకు కొంటామని, తమకు పర్మిషన్లు ఇచ్చి బ్యాంక్లోన్లు ఇచ్చి అన్నీ అధికారికంగా ఇవి సక్రమమే అంటూ వివిధ ప్రభుత్వశాఖల అధికారులే ధ్రువీకరించిన నేపథ్యంలో ఇది అక్రమమంటూ కూల్చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
అజీజ్‌నగర్‌లోని తన ఫామ్‌హౌస్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఒక్క అంగుళం ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలినా సొంత ఖర్చులతోనే తానే కూల్చివేయిస్తానని, చట్టప్రకారం మార్క్ చేస్తే తనకు సంబంధించిన ఏ కట్టడమైనా 48 గంట ల్లో తానే కూల్చేయిస్తానంటూ సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచంద్రరావు లేఖ రాశారు. ఆయన ఫామ్‌హౌస్ జలాశయానికి ఆనుకునే ఉన్నదని అక్కడికి వెళ్లిన ఎవరికైనా తెలుస్తుంది. అయితే అక్కడికి హైడ్రా పోదు.
ఇక మరో కాంగ్రెస్ నేత పట్నం మహేందర్‌రెడ్డి ముచ్చటే వేరు. సీఎం రేవంత్ గండిపేట, హిమాయత్‌సాగర్‌లో ఇండ్లు తీస్తున్నారని, ఇది మంచికార్యక్రమమని ప్రశంసించారు. తన ఫామ్‌హౌస్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో లేదని అధికారులే నివేదిక ఇచ్చారని సెలవిచ్చారు. కానీ పట్నం ఫామ్‌హౌస్ చూస్తే చాలు, కొలవాల్సిన అవసరం కూడా లేదు. చుట్టూ నీళ్లు, మధ్యలో ఐలాండ్ మాదిరి ఆ ఫామ్‌హౌస్. జలాశయంలోనే ఉన్న ఈ నిర్మాణంపై హైడ్రా ఎందుకు దృష్టిపెట్టదో ఆ మాజీ మంత్రికే తెలియాలి.
మంత్రి వివేక్ వెంకటస్వామి తాను చట్టం పక్రారమే ఫామ్‌హౌస్ కట్టుకున్నానని చెప్తున్నప్పటికీ జలమండలి అధికారులు తమ నివేదికలో వివేక్ నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నట్టుగా ఇచ్చారు. అయినా వాటి దిక్కు వెళ్లే ధైర్యం ఏ అధికారి చేయరు. చెరువుల వద్ద అక్రమ నిర్మాణాలు ఉంచం అంటూ బీరాలు పోతున్న హైడ్రా ఆ వైపే చూడదు.
తన ఇల్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నా, అంతెందుకు ఒక్క ఇటుకపెళ్ల అందులో ఉన్నా ఇల్లు మొత్తం పగులగొట్టండి. మీరే టేపు లు పట్టుకొని వచ్చి కొలవండంటూ చాలెంజ్ విసిరిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగోతం ఆ తర్వాత గూగుల్ బయటపెట్టింది. అంతేకాదు, పురపాలకశాఖ 500 మీటర్ల నిబంధన తెరపైకి తేవడంతో ఇప్పటివరకు మంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో అటు హైడ్రా కానీ, ఇటు ఇతర శాఖలు కానీ టేపులు పెట్టి కొలిచిందీ లేదు.
శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే చేసిన కేఎల్ఆర్ వర్టెక్స్ గిగా సిటీ రియల్ వెంచర్‌తో సూరం చెరువు కబ్జాకు గురైంది. ఈ విషయంలో అధికారులకు, చివరకు మంత్రి ఉత్తమ్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారంటే అసలు హైడ్రా ఏ రూట్లో వెళ్తున్నదనేది లక్ష డాలర్ల ప్రశ్న. అంతెందుకు, రంగారెడ్డి జిల్లా కాగజ్‌ఘాట్ పరిధిలోని అలీ చెరువు విస్తీర్ణం 25 ఎకరాలు కాగా చెరువు పరిధిలో ఎస్ఆర్ డెవలపర్స్‌కు చెందిన ముప్పాళ్ల వెంకటనర్సయ్య అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తగిన చర్యలు తీసుకోండంటూ నడిచెరువులో రిసార్ట్ ఏర్పాటు చేసి విల్లాలు కట్టడంపై నీటిపారుదలశాఖ ఏఈ ఈఆర్ శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఈఈ సైతం హెచ్ఎండీఏకు లేఖ రాశారు. ఏ ఒక్క అధికారి ఆ వైపు కన్నెత్తి చూడలేదు ఎందుకంటే బీహార్ అసెంబ్లీ బలపరీక్ష కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహించింది ఇక్కడే. వారిని కలిసేందుకు రేవంత్ వస్తాడని ప్రభుత్వ నిధులతో చెరువులో రోడ్డు వేశారు.
కాంగ్రెస్ నేతలకు సంబంధించిన నిర్మాణాలు చెరువుల దగ్గర ఉండటం, పల్లంరాజు విషయంలో హైడ్రా ప్రదర్శించిన అత్యుత్సాహం వెరసి ఢిల్లీ హైకమాండ్ మందలింపుతో రేవంత్ సూచనలతో హైడ్రా రూట్ మార్చేసింది. హైడ్రా ఏర్పాటు తర్వాత అంటే జూలై 19 తర్వాత జరిగే నిర్మాణాలే కూల్చేస్తాం తప్ప పాతవాటి జోలికిపోమంటూ ప్రకటించింది. అప్పటివరకు చాలామంది సామాన్యుల ఇళ్లను నేలమట్టం చేసిన హైడ్రాకు తిరుపతిరెడ్డి వంటి అధికారపార్టీ నేతల నిర్మాణాలపై విమర్శలు రాగానే వెనక్కు తగ్గితే మరి కూల్చేసిన వారి సంగతేంటి? వారి పరిస్థితిని మళ్లీ ఎవరు చక్కదిద్దుతారంటూ ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ప్రధానంగా సామాన్యులకు ఓ న్యాయం, బడాబాబులకు మరో న్యాయం అన్నట్టు హైడ్రా వ్యవహరిస్తున్నదనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉండవు.