మంత్రిగారి రాజప్రసాదం…!!
ఇది హిమాయత్‌సాగర్ చెంతన కొలువుదీరిన సాక్షాత్తు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సౌధం. వాస్తవానికి ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయంలో నీటిమట్టం పెరిగి నీళ్లు ఇంకా ముందుకు వెళ్లాలి. కానీ వందల టిప్పర్లతో మట్టి నింపడంతో నీళ్లు ముందుకుపోయే పరిస్థితి.
అయినప్పటికీ మంత్రివర్యులు, ఆయన సోదరుడి గృహం ఎఫ్టీఎల్తో పాటు బఫర్‌జోన్‌లోనూ ఉందనేది కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. బఫర్‌జోన్‌లో ఉన్నా తన ఇంటిని కూల్చుకోమని మంత్రి పొంగులేటి గతంలోనే సెలవిచ్చారు. కానీ హైడ్రాగానీ, ఇతర అధికారులుగానీ ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
ఈ ఎఫ్టీఎల్ పరిధి కానపడదే!
ఇది రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని కాఘజ్ఘట్ గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలోని అలీ (ఆల్ల చెరువు) చెరువు ఎఫ్టీఎల్ పరిధి (రెడ్‌మార్క్ ఉన్నది). స్వయంగా హెచ్ఎండీఏ అధికారికంగా గుర్తించిన హద్దు ఇది. ఇందులోనే సిరి నేచర్స్ వ్యాలీ రిసార్ట్ ఉండటంతోపాటు ఏకంగా రియల్ వెంచర్ కూడా చేశారు. ఇప్పుడు అందులో విల్లాల నిర్మాణం కూడా జోరుగా సాగుతున్నది.
నీటిపారుదల శాఖ గత ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేస్తే పోలీసు శాఖ కేసు నమోదు చేసింది. కానీ అధికారులెవరూ ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదు. హెచ్ఎండీఏ సర్వేనే సదరు ప్రైవేటు సంస్థ ప్రశ్నిస్తూ కోర్టుకు వెళితే మళ్లీ సర్వే చేయమని హైకోర్టు ఆదేశించింది. కానీ సంవత్సరాలవుతున్నా నీటిపారుదల శాఖ సర్వే చేయదు. ఎందుకంటే సర్వే చేస్తే చర్యలు తీసుకోవాలి కదా!
ఆయనగారి రియల్ దందా!
Suram Cheruvulo Venture
రంగారెడ్డి జిల్లా మంఖాల్‌లోని మరో రియల్ వెంచర్ ఇది. వర్టెక్స్-కేఎల్ఆర్ గిగా సిటీ పేరిట చేసిన ఈ వెంచర్లో ఏకంగా రెండు చెరువులు సమిధగా మారాయి. ఎగువన శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు పహాడీషరీఫ్ వైపు నుంచి భారీ వరద పదెకరాల కొత్తకుంటలోకి చేరి.. అక్కడి నుంచి నాలాల ద్వారా దిగువన 60.32 ఎకరాల విస్తీర్ణంలో సూరోని చెరువులోకి వస్తాయి.
కానీ కొత్తకుంటలో దాదాపు ఎనిమిది ఎకరాలు, సూరోని చెరువులో సుమారు 30 ఎకరాలకు పైగా ఆక్రమించి ఈ వెంచర్ ఏర్పాటు చేశారు. నాలాలను మట్టితో నింపి డ్రెయిన్ బాక్సులు నిర్మించారు. నీటిపారుదల శాఖ, రెవిన్యూశాఖ అధికారులు వచ్చారు… సర్వే చేసి వెళ్లారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు.