HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్, అక్టోబర్ 21 ( నమస్తే తెలంగాణ ): రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. సరిగ్గా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరు ఇలానే ఉన్నది. మొన్నటి వరకు అనుమతులున్న నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చేస్తున్నా.. సప్పుడుజెయ్యని సీఎం ఇప్పుడేమో అనుమతులున్న వాటి జోలికి వెళ్లబోమని ప్రకటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా సీఎం ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రితోపాటు హైడ్రా చేసిన తాజా ప్రకటనలపై బాధితులు సందేహాలు లేవనెత్తుతున్నారు. అన్నీ అనుమతులు ఉన్నా ఇప్పటివరకు కూల్చేసిన నిర్మాణాల సంగతేమిటి? తమ గూడు కూల్చొద్దు సారూ.. అన్నీ అనుమతులు ఉన్నాయంటూ అధికారులను ప్రాధేయపడినా కనికరించకుండా చేపట్టిన కూల్చివేతలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇల్లు కోల్పోయి రోడ్డున పడిన వ్యక్తుల ఘోస ఎవరు వింటారు? తమకు జరిగిన అన్యాయాన్ని ఏమిచ్చి సరిదిద్దుతారు? వీటికి సమాధానం సీఎం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూల్చిన తమ ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఇవిగో ఆధారాలు..!
శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ హఫీజ్‌పేట డివిజన్ మదీనాగూడలోని సర్వే నంబర్ 26లో 36 ఎకరాల ఈర్ల చెరువు ఉన్నది. ఇందులో గతంలోనే హెచ్ఎండీఏ లే అవుట్ చేసింది. ఇదే లే అవుట్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు 266 గజాల చొప్పున మూడు ఫ్లాట్లను కొనుగోలు చేసి భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయి విచారణతోపాటు హుడా అప్రూవ్డ్ లే అవుట్‌ను పరిశీలించిన మీదట, పట్టణ ప్రణాళికా విభాగం నివేదిక ఆధారంగా 2023 జులై 3న జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ నాటి డిప్యూటీ కమిషనర్ నందగిరి సుధాంశ్ అధికారిక అనమతులను (మే బీ అప్రూవ్డ్) మంజూరు చేశారు. తదుపరి సాధారణ బదిలీల్లో ఆయన సికింద్రాబాద్‌కు డీసీగా వెళ్లారు. భవన నిర్మాణం పూర్తి కావడంతో సదరు యజమానుల అభ్యర్థనతో తదుపరి వచ్చిన అధికారులు ఆ భవనాలకు 2024లో అక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ)ని సైతం జారీ చేశారు. ఆగస్టు 19న గృహ ప్రవేశానికి యజమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ భవనాలు హుడా లే అవుట్లో ఉండి అధికారిక అనుమతులతో నిర్మించినప్పటికీ బఫర్ జోన్లో ఉన్నాయంటూ ఈ ఏడాది ఆగస్టు 10న హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. కూల్చివేతల సమయంలో తమ వద్ద అనుమతులున్నాయని సదరు భవన యజమానులు ఎంత మొత్తుకున్నా హైడ్రా అధికారులు పెడచెవిన పెట్టి తమ పనిని పూర్తి చేశారు. తాజాగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అయినప్పటికీ అనుమతులున్న భవనాలను కూల్చివేయబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్న నేపథ్యంలో తమకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చుతారని సదరు బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు పూర్తి స్థాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
గడికో రాగం.. సామాన్యుడికి ద్రోహం!
హైడ్రా ఆదినుంచీ దిశదశ లేకుండానే సాగుతున్నది. గూడు కూల్చితే కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిసి కూడా రేవంత్ సర్కార్ నిర్దయగా వ్యవహరించిందని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థల విషయంలో సైతం హైడ్రా బెదిరింపులకు పాల్పడింది. కూల్చడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నది. అక్రమ నిర్మాణమైతే కూల్చుకోవచ్చంటూ ఆ ఎమ్మెల్యేలు సైతం ప్రకటించారు. ఈ ప్రక్రియలోనే మరో సవాల్ హైడ్రా ముందుకొచ్చింది. ఓల్డ్ సిటీలో ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా కాలేజీ కూడా మూసీలోనే ఉన్నదని కూల్చాలంటూ తెరపైకి వచ్చింది. అప్పటివరకు అక్రమ నిర్మాణాలను కూల్చేసే పనిలో ఉన్న హైడ్రా ఉన్న పలంగా మౌనం వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ అప్పట్లో సైలెంట్ అయిపోయారని వార్తలు వినిపించాయి. ఈ సంఘటన నుంచి బయటపడటానికి ఒవైసీ కాలేజీకి ఏమీ కాకుండా చూడటానికి ‘విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న విద్యా సంస్థల జోలికి వెళ్లం’ అంటూ శాంతిరాగం అందుకోవాల్సి వచ్చింది. ఇలా ఎవరి ప్రయోజనాల కోసం కూల్చివేతలు చేశారో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమాధానం చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.