CV Ranganath | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నదని కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. రెండు నెలలు కష్టపడి వందేండ్ల నాటి మ్యాప్‌ను సంపాదించినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే యూసుఫ్‌గూడలోని పెద్ద చెరువు కృష్ణకాంత్ పార్క్‌గా మారిపోయిందని తెలిపారు. చెరువును పూడ్చివేసి పార్కు సమీపంలోనే కట్టమైసమ్మ గుడి కట్టారని చెప్పారు. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలను హైడ్రా విస్మరించిందని విమర్శించారు. అసెంబ్లీలో చర్చ జరగకుండా గవర్నర్ ఆదేశాలతో హైడ్రాకు అధికారాలు కట్టబెడితే అవి చెల్లవని పేర్కొన్నారు. 40 ఏండ్ల నుంచి మధురానగర్‌లో ఉంటున్న రంగనాథ్.. అక్కడ చెరువు ఉండేదన్న విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.
ఆ చెరువు హెచ్ఎండీఏ పొందుపరిచిన చెరువుల జాబితాలో ఎందు కు లేదని నిలదీశారు. చెరువు నుంచి కిలోమీటర్ దూరంలో తన ఇల్లు ఉన్నదని చెప్తున్న రం గనాథ్… 500 మీటర్ల లోపల ఉన్న ఇండ్ల కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. వందేండ్ల నాటి మ్యాప్ ఆధారంగా వెంగళరావునగర్‌లో రంగనాథ్ నివాసం ఉం టున్న ఇ ల్లు, పెద్ద చెరువు బఫర్‌జోన్ పరిధిలోకి వస్తుందని వివరించారు. బఫర్‌జోన్ పరిధిలో ఇల్లు నిర్మించడం లేదని రంగనాథ్ నిరూపించుకోవాలని జడ్సన్ సవాలు విసిరారు. బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి చెరువు భూమిలో కట్టుకుంటే ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా? అని నిలదీశారు.