Minister Ponguleti | హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): తన ఇల్లు ఎఫ్టీఎల్లో గానీ, బఫర్ జోన్లో గానీ ఉన్నట్టయితే వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆదేశిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. ఒక్క ఇటుక బఫర్ జోన్లో ఉన్నా, ఇల్లు మొత్తం కూల్చేయాలని సూచించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన పొంగులేటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానమిచ్చారు. తన ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ బీఆర్ఎస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యతపై తనపై ఉన్నదని చెప్పారు.
‘రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఉన్నదని అంటున్నారు. నేను చాలెంజ్ విసురుతున్నా. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆదేశిస్తున్నాను. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఇంకా ఎంతమంది వస్తారో రమ్మనండి. అందర్నీ తీసుకెళ్లి నా ఇల్లు కొలవండి. ఒకవేళ నా ఇల్లు ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఉన్నదని తేలితే మొత్తం కూలగొట్టండి. ఒక్క ఇటుక పెడ్డ ఉన్నా సరే మీరే కూలగొట్టండి. ఇది నా చాలెంజ్’ అని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ నేతలు తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. పేదలు నష్టపోవద్దనే మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిందని తెలిపారు. ఎవరు నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు నిర్మించినా కూల గొడతామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న తమ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడికి సంబంధించిన బిల్డింగ్‌ను కూడా కూల్చేసినట్టు తెలిపారు.