హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ బీఆర్ఎస్కు చెందిన మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తుదపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేరొంది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
హైడ్రా అధికారాలు చెల్లవు
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువుల రక్షణ, ఆక్రమణల తొలగింపుతోపాటు విపత్తుల సమయంలో తగిన చర్యలు చేపట్టే నిమిత్తం ప్రభుత్వం హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ఈనెల 3న ఆర్డినెన్స్ జారీచేసింది. దీనిని మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు) హైకోర్టులో సవాలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆర్డినెన్స్ వల్ల హైడ్రాకు విస్తృతాధికారాలను కట్టబెట్టడం చట్ట వ్యతరేకమని చెప్పారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374బీ ద్వారా హైడ్రాకు ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం అధికారాలు కల్పించడం చెల్లదని అన్నారు. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే అధికారం, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఆర్డినెన్స్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నిరాకరించిన హైకోర్టు, ప్రతివాదుల వాదనల తర్వాతే ఉత్తర్వుల జారీకి ఆసారం ఉంటుందని స్పష్టం చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.