హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ను (Naveen Yadav) ఓడించేందుకే హైడ్రా (HYDRA) అధికారులు ఎన్నికల సమయంలో ఇండ్లను కూలగొడుతున్నారని, అధికారుల అత్యుత్సాహం.. హైడ్రాపై కోపం వల్లే సర్కారుపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుత్నునదని చెప్పారు. సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు హైడ్రా అధికారులు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారిపై హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టిపెట్టాలని సూచించారు. కుట్రలు చేస్తున్న హైడ్రా అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు ఫిర్యాదు చేస్తానన్నారు. హైడ్రా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని, ఇలాంటి హైడ్రా సంగారెడ్డి నియోజకవర్గం జోలికి రావొద్దని సెప్టెంబర్‌లో ఆయన ఏకంగా ఓ ప్రత్రికా ప్రకటననే ద్వారా హెచ్చరించారు. కూల్చివేతల పేరిట అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే సహించేది లేదని చెప్పారు. హైడ్రావల్లే పార్టీకి నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
జూబ్లీహిల్స్‌లో ఓటమి ఖాయమని తేలినందుకే జగ్గారెడ్డి నెపాన్ని హైడ్రాపైకి నెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ప్రజల ప్రశ్నలకు బదులు చెప్పలేక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అసలు విషయాన్ని వదిలేసి జగ్గారెడ్డి హైడ్రాపై నిందలు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేవలం పేదల పాలిట శాపంలా మారిన హైడ్రా తీరును మొదటి నుంచీ బీఆర్ఎస్ ఎండగడుతున్నది. హైడ్రా బాధితులకు అండగా ఉంటూ వస్తున్నది. వారికి మద్దతుగా ఆందోళనలు చేపడుతున్నది. బాధితులకు న్యాయ సాయం చేసేందుకు సైతం ముందుకు వచ్చింది. సోషల్ మీడియా వేదికగా హైడ్రా ఆగడాలను ప్రజాక్షేత్రం ముందుంచుతున్నది. ఇప్పుడిదే కాంగ్రెస్ పార్టీ నేతల్లో వణుకుపుట్టిస్తున్నది. హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, తద్వారా లబ్ధిపొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం విస్తుగొలుపుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘ఆడలేక మద్దెల బరువు’ అన్నట్టు.. ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగాల్సింది పోయి తామే తెచ్చిన హైడ్రాపైనే నిందలు వేసి.. ఇది ప్రతిపక్షం కుట్ర అని బీఆర్ఎస్పైకి తోసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు.