సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మరిన్ని పేదల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్తో దాడి చేయనున్నట్టు సమాచారం. 46 ఏండ్ల నుంచి నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇండ్లలో నివాసం ఉండే వారిపై హైడ్రా చర్యలు తీసుకోబోదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల వెల్లడించారు. బుధవారం ముఖ్యమంత్రి అక్రమణదారులను ఎట్టి పరిస్థితులలోను వదలమని, కోర్టుకు వెళ్లినా తాము స్టే తెచ్చి కూల్చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా పరిధిలోని చెరువుల మ్యాప్‌లను ఎన్ఆర్ఎస్సీ నుంచి సేకరిస్తున్నట్టు వెల్లడించారు. 1979 నుంచి 2023 వరకు చెరువులు ఎలా ఉన్నాయనే విషయాలను విశ్లేషిస్తున్నారు. శాటిలైట్ ఆధారంగా ఎన్ఆర్ఎస్సీ(నేషనల్ రిమోంట్ సెన్సార్ సెంటర్) చెరువులకు సంబంధించిన చిత్రాలు తీస్తున్నది. హైడ్రా దీనినే పరిగణలోకి తీసుకుని కూల్చివేతలు చేసేందుకు సన్నాహాలు చేస్తారని చర్చ మొదలయ్యింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయి. దీంతో 46 ఏండ్ల నుంచి ప్రభుత్వ అనుమతులు తీసుకొని, తీసుకోకుండా చెరువులు, కుంటలు, నాలాల పక్కన ఇండ్లు నిర్మించుకున్న పేదలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
1979 నుంచి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతూ ఔటర్ లోపల దాదాపు విస్తరించింది. హైడ్రా పరిధిలో వెయ్యికిపై చెరువులు, కుంటలు ఉంటాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాలు తయారు చేసిన మ్యాప్‌లు, 46 ఏండ్ల ఎన్ఆర్ఎస్సీతో పోల్చుకొని చెరువులకు సంబంధించిన డైరెక్టరీని హైడ్రా తయారు చేస్తున్నది. ఎన్ఆర్ఎస్సీ, మూడు ప్రభుత్వ విభాగాలు రూపొందించిన మ్యాప్‌లకు చాలావరకు పొంతనలేవు. చాలామంది పేదలు చెరువులు, కుంటల పక్కన తెలిసీతెలియక ఏండ్ల క్రితమే ప్లాట్లు కొని ఇండ్లు నిర్మించుకున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల నుంచి అనుమతులు తీసుకున్నా.. అవి చెల్లవని ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఇండ్లు ఎప్పుడు కట్టినా కూల్చేస్తామనే సంకేతాలు ప్రభుత్వం నుంచి వెళ్తుండడంతో పేదలు బిక్కు బిక్కుమంటూ బతుకు సాగిస్తున్నారు. ప్రజలలో జరుగుతున్న చర్చపై హైడ్రా కమిషనర్‌తో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు.