HYDRA | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి తర్వాత దూకుడు మరింత పెంచేందుకు హైడ్రా సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా సుమోటోగా కేసులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు సంక్రాంతి తర్వాత హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తున్నది. రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో హైడ్రా కార్యాలయం బి-బ్లాక్‌లో అధికారులు పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉంటారు.
సాధారణంగా వచ్చే ఫిర్యాదులే కాకుండా హైడ్రా దృష్టికి వచ్చిన ఆక్రమణలపై ఆధారాలుంటే సుమోటోగా కేసులు నమోదు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెరువుల ఆక్రమణలపై సీరియస్‌గా ఫోకస్ చేసేలా ప్రణాళికలు రచించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. హైడ్రాకు అనుబంధంగా ఓ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి రంగనాథ్ ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తున్నది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిని సంక్రాంతి సందర్భంగా నేడు రద్దు చేస్తున్నామని హైడ్రా అధికారులు తెలిపారు. వచ్చే సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.