HYDRAA Vs GHMC | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో తన మార్క్ పాలన కోసం ఓ అధికారి తాపత్రయ పడుతుంటే, అదే గ్రేటర్ విషయంలో తన పెత్తనం కోసం మరో అధికారి చూపుతున్న అత్యుత్సాహం ఆ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్‌కు దారితీసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ (ఐఏఎస్), హైడ్రా కమిషనర్ (ఐపీఎస్) మధ్య అంతర్గత వివాదం చెలరేగింది. హైడ్రా ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ ఉద్యోగులు కార్పొరేషన్ పనులను వదిలేసి హైడ్రా వెంట తిరుగుతుండటంతో గ్రేటర్ కమిషనర్ ఆమ్రపాలి ఇటీవల కన్నెర్రజేశారు.
జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. హైడ్రా నుంచి రిలీవ్ కావాలంటూ ఉత్తర్వులు వచ్చినా విజిలెన్స్ అధికారులు, సిబ్బంది అక్కడినుంచి రాకపోవడంతో వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఏకంగా వారి జీతాలను ఆపేయాలంటూ ఫైనాన్స్ విభాగానికి లేఖ పంపారు. అయినా ఉద్యోగులు తమను హైడ్రాలోనే ఉంచాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అభ్యర్థనలు పెట్టుకోవడంతో ఆయన ప్రభుత్వంతో మాట్లాడుతానంటూ హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇద్దరు అధికారుల మధ్య వివాదానికి కారణమైంది.
ఇదే సమయంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా హైడ్రా వ్యవహారంపై వ్యతిరేకంగా ఉండగా, ఎంఐఎంతో పాటు పలు పార్టీల కార్పొరేటర్లు హైడ్రా వ్యవహారశైలిపై కమిషనర్‌కు, మేయర్‌కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు తాత్కాలిక విధుల కోసం వెళ్లిన ఉద్యోగులు అక్కడే ఉండి గ్రేటర్ పనులను అటకెక్కించారని, వారందరినీ వెనక్కిరప్పించాలని కోరారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రధానమైంది కాగా వారంతా హైడ్రాకే పనిచేసున్నారని, వారిని వెనక్కి పిలిపించడంతో వివాదం ముదిరింది.
సహజంగా ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి రావాల్సి ఉండగా ఇప్పుడు హైడ్రా వద్దకు వెళ్తుండడంతో గ్రేటర్ పాలకమండలి మండిపడుతున్నట్టు తెలిసింది. తమకు ప్రాధాన్యత తగ్గిపోతున్నదని, సిటీలో తమ పరిధిలో ఎక్కడికి వెళ్లినా హైడ్రా మాటే తప్ప జీహెచ్ఎంసీ మాటే లేదని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు.
హైడ్రా ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి!
ఇక హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను గ్రేటర్‌కు పంపడంతో మరో వివాదం తలెత్తుతున్నది. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ చేయాలని జీహెచ్ఎంసీకి హైడ్రా కమిషనర్ లేఖ పంపుతున్నారు. తమ పనులకే సమయం చాలడం లేదంటే మళ్లీ ఈ హైడ్రా ఫిర్యాదుల గోల ఏమిటని గ్రేటర్ అధికారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని విభాగాల అధికారులు కమిషనర్‌కు పని ఒత్తిడిపై మొర పెట్టుకున్నారు. తాము హైడ్రా వెంట పడితే జీహెచ్ఎంసీ పనులన్నీ కుంటుపడుతాయని, ప్రజారోగ్యం, ప్రజాపాలన అటకెక్కుతుందని చెప్పారు.
దీంతో ఇటీవల వచ్చిన మేడికుంట చెరువుకు సంబంధించి ఫిర్యాదుపై కమిషనర్ పెద్దగా స్పందించకపోగా పని ఒత్తిడి కారణంగా పరిశీలనను హోల్డ్‌లో పెట్టారు. హైడ్రాకు కొత్తగా సిబ్బందిని కేటాయించినా ఇంకా జీహెచ్ఎంసీపైనే ఒత్తిడి పెంచడంపై బల్డియా కమిషనర్ సీరియస్‌గా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే విభాగం జీహెచ్ఎంసీలో ఒక భాగం కాగా.. ఇప్పుడు మొత్తం గ్రేటర్పైనే పెత్తనం చెలాయించాలనుకోవడంపై కమిషనర్‌తో పాటు ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నారు.
విజిలెన్స్ ఉద్యోగులపై ఆమ్రపాలి సీరియస్
గ్రేటర్ కమిషనర్ ఆమ్రపాలికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మధ్య కోల్డ్‌వార్ తారస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. గ్రేటర్ ఉద్యోగులను హైడ్రాకు బదలాయించిన తర్వాత మళ్లీ వాళ్లను వెనక్కి పంపకుండా రంగనాథ్ చూపించిన అత్యుత్సాహం ఆమ్రపాలి ఆగ్రహానికి కారణమైంది. దీంతో విజిలెన్స్ విభాగం ఉద్యోగుల విషయాన్ని ఆమె చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు హైడ్రా వచ్చీ రాగానే ఆక్రమణల పేరిట కూల్చివేతలు మొదలుపెట్టి అందుకు కారణమంటూ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన చందానగర్ ఏసీపీ రాజ్‌కుమార్, డీసీపీ సుధాన్ష్ పై హైడ్రా కమిషనర్ కేసులు ఫైల్ చేయించారు.
అనుమతులకు సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ ఈ కేసులు పెట్టడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. తమ ఉద్యోగుల విషయంలో హైడ్రా కమిషనర్ చేసిన పని పట్ల జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు ఉద్యోగులంతా అసహనంతో ఉన్నారు. ఐఏఎస్ పాలనలో కొనసాగుతున్న గ్రేటర్ కార్పొరేషన్లో తన ప్రాబల్యం చాటుకోవడానికి ఐపీఎస్ రంగనాథ్ చూపిన ఉత్సాహం ఇద్దరి మధ్యా కోల్డ్‌వార్‌కు కారణమైందని ఉద్యోగులు అంటున్నారు.