HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘హైడ్రా వస్తే మున్సిపల్ కార్పొరేషన్ పోతుందా? పర్మిషన్లకు ఇక మున్సిపాలిటీతో పనిలేదా? రెవెన్యూ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులపై కూడా హైడ్రాకే అధికారాలా? నిర్మాణాల నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రానే చూసుకుంటుందా? హైడ్రా వచ్చిన తర్వాత ఈ సంస్థలన్నీ ఏ పనిచేయాలి? వీళ్లందరినీ హైడ్రాలోనే మెర్జ్ చేసి ప్రభుత్వం తమ బరువు దించుకోబోతున్నదా?’ ఇలాంటి చర్చలు జోరుగా సాగుతున్నాయి. హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన నేపథ్యంలో.. నిన్న మొన్నటివరకు ఒక ‘ఏజెన్సీ’గా ఉన్న హైడ్రా, ఇప్పుడు ప్రభుత్వంతో సమాంతర వ్యవస్థగా పనిచేయబోతున్నది. ఆర్డినెన్స్‌లో హైడ్రాకు కల్పించినట్టుగా చెప్తున్న అధికారాలు మున్సిపల్, హెచ్ఎండీఏ, రెవెన్యూ, వాటర్‌వర్క్స్, ఇరిగేషన్ శాఖలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్థానికసంస్థలైన కార్పొరేషన్, మున్సిపాలిటీలన్నీ నామమాత్రంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మున్సిపల్చట్టం, జీహెచ్ఎంసీ చట్టాల్లోని ప్రధాన అంశాలను హైడ్రాకు బదిలీ చేస్తూ వాటిలో ఉన్న పలు విభాగాలను నిర్వీర్యం చేసేలా ఈ ఆర్డినెన్స్ ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ప్రస్తుతం హైడ్రాకు ఇచ్చిన అధికారాలతో ముఖ్య శాఖలన్నీ నిర్వీర్యమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రస్తుత చట్టాల ప్రకారం హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించాలంటే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా శాఖలకు సంబంధించిన పలు చట్టాల పరిధిలో పనిచేయాల్సి వస్తున్నది. తాజా ఆర్డినెన్స్‌తో సదరు శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవచ్చు లేదా అవసరాన్ని బట్టి వారి అధికారాలను కూడా హైడ్రాకు బదిలీచేసే అవకాశం ఉంటుంది. మున్సిపల్ చట్టంలో ఉన్న అధికారాల బదలాయింపుతో చుట్టుపక్కల మున్సిపాలిటీల అధికారాలన్నీ దాదాపుగా నామమాత్రంగా మారనున్నాయి. ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలను పరిరక్షిస్తూ సర్వాధికారాలు వచ్చేలా ఈ చట్టం రూపొందించారు. హైడ్రాకు జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోలకు ఉన్న అధికారాలను బదలాయించారు. అన్ని ముఖ్య శాఖల నుంచి ముఖ్య చట్టాలను తీసుకొని వాటిని హైడ్రాకు బదలాయిస్తూ ఆయా శాఖలు నామమాత్రంగా వ్యవహరించేలా చేస్తున్నారు.
చెరువులు, వాటి హద్దులను నిర్దేశించడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రస్తుతం నీటిపారుదల విభాగం చూస్తున్నది. ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ బాధ్యతను కూడా హైడ్రాకే అప్పగించారు. బీపాస్ చట్టం-2020 ప్రకారం.. జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్‌ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఉన్న అధికారాలను ఇవ్వడంతో టాస్క్‌ఫోర్స్ పని కూడా హైడ్రా కంట్రోల్‌లోకే పోతుందని భావిస్తున్నారు. హెచ్ఎండీఏ చట్టం-2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారాలు, భూ ఆదాయ చట్టంలోని సెక్షన్-1317(ఎఫ్) ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు ఆర్డీవో, కలెక్టర్‌కు ఉన్న అధికారాలు, అవే అంశాలకు సంబంధించి నీటిపారుదల చట్టంలోని జీవోఎంఎస్-67 ద్వారా 2002లో యూడీఏ అధికారికిచ్చిన అధికారాలు, భూ ఆక్రమణ యాక్ట్-1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టాయాక్ట్-2002, తెలంగాణ బిల్డింగ్రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను హైడ్రాకు కట్టబెట్టారు. నీటిపారుదల శాఖలో ఉన్న పలు అంశాలు హైడ్రా పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ఆ శాఖ కూడా నామమాత్రంగా మారనున్నది. హెచ్ఎండీఏ చేపట్టాల్సిన పరిధిలో జరగాల్సిన పనులు కూడా ఇప్పుడు హైడ్రా చేస్తే హెచ్ఎండీఏ ఏంచేస్తుందనే ప్రశ్న తలెత్తుతున్నది.
హైడ్రాను కీలకమైన విభాగంగా చేస్తూ మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారాలన్నింటినీ హైడ్రాకు కట్టబెట్టడం పట్ల ఆయా శాఖల అధికారులు, సిబ్బందిలో అసంతృప్తి మొదలైంది. హైడ్రాకు కల్పించిన అధికారాలపై అటు వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ, ఇటు ప్రజల్లోనూ చర్చ జరుగుతున్నది. చట్టాల్లో ఉన్న లొసుగులు, వాటిపై పూర్తి స్టడీ చేయకుండానే డైరెక్ట్‌గా ఎటాక్ చేయడం పట్ల ఉద్యోగుల్లో ఇప్పటికే అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పుడు నేరుగా అన్ని అధికారాలను హైడ్రాకే కట్టబెట్టడంతో తమ పరిధి, పరిస్థితి ఏమిటి? తమ బాధ్యతలేమిటి? అనే ప్రశ్నలు ఉద్యోగుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇన్నాళ్లూ మున్సిలిటీ ఇచ్చే ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్’తో పనులు జరిగిన చోట.. ఇప్పుడు హైడ్రా ఎన్వోసీ కావాలనే నిబంధన వస్తుందని పట్టణ విభాగ నిపుణులు చెప్తున్నారు.
హైడ్రాకు ఇచ్చిన అధికారాలు గ్రేటర్ హైదరాబాద్‌లో టౌన్‌ప్లానింగ్ పనితీరుపై ప్రభావం చూపనున్నాయి. టౌన్‌ప్లానింగ్ పరంగా పర్మిషన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పుడు అందులో హైడ్రా తలదూర్చే అవకాశం ఉన్నది. ఆర్డినెన్స్‌లో పొందుపరిచిన పలు విషయాలపై చర్చిస్తూనే ఈ ఆర్డినెన్స్‌తో తమ శాఖలన్నీ నిర్వీర్యమైపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు. పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న అధికారాలను హైడ్రాకు కల్పించడం పూర్తిగా తమ పరిధిలో ఉన్న సిటీపై పెత్తనం చెలాయించడమేనని, హైడ్రాకు ఇచ్చిన అధికారాలతో శాఖల మధ్య సమన్వయం కొరవడే అవకాశం ఉన్నదని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా హైడ్రా తమ పరిధిలోకి ఎంటరయితే చాలా వరకు సమస్యలొస్తాయని, సాంకేతికంగా గ్రేటర్ చట్టంలో హైడ్రాను చేర్చినా.. పెత్తనమంతా హైడ్రాదే ఉంటుందని, జీహెచ్ఎంసీలోని ప్రధాన విభాగాలకు ఇది పెద్ద తలనొప్పిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. హైడ్రా గుర్తించిన ఆక్రమణలకు నోటీసులివ్వడం వరకే తమ బాధ్యత అని, ఆ తర్వాత జరిగే ప్రతి పనీ హైడ్రా నేతృత్వంలోనే జరుగుతుందని భావిస్తున్నారు.
ఈ ఆర్డినెన్స్ ప్రకారం మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ తదితర శాఖల్లోని ముఖ్య అధికారాలను హైడ్రాకు కట్టబెడుతున్నారు. జీహెచ్ఎంసీలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఇప్పుడు పలు కీలక శాఖలను నియంత్రించే వ్యవస్థగా మారనున్నది. ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా 73,74 సవరణలకు తూట్లు పొడుస్తూ హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థలకు చెక్ పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ మున్సిపల్ యాక్ట్-1955లో 374(బీ) సెక్షన్‌ను చేరుస్తూ ఆర్డినెన్స్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో జీహెచ్ఎంసీ పూర్తిగా నిస్తేజంగా, పవర్‌లెస్‌గా మారనున్నది.
ఇందులో కీలకమైన టౌన్‌ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లేక్‌ప్రొటెక్షన్, వాటర్‌బాడీస్ వంటి పలు విభాగాల అధికారాలను హైడ్రాకు బదలాయించడంతో ఇక జీహెచ్ఎంసీతో పనేంటన్న వాదన వినిపిస్తున్నది. ఎక్కడైనా బిల్డింగ్ కట్టాలన్నా, కూల్చివేయాలన్నా, స్థానిక నేతల దగ్గరకు వెళ్లే ప్రజలు.. ఇప్పుడు హైడ్రా దగ్గరికి వెళ్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన జీహెచ్ఎంసీ కీలక నేత ఒకరు అసహనం వ్యక్తంచేశారట! పర్మిషన్ నుంచి కూల్చివేత వరకు అన్నీ హైడ్రానే చూసుకుంటే నగరపాలకసంస్థ ప్రాధాన్యం కోల్పోనున్నది. జీహెచ్ఎంసీకి సంబంధించి మున్సిపల్ యాక్ట్-2019 ప్రకారం కమిషనర్‌కు ఉన్న అధికారాలను హైడ్రాకు వర్తింపచేస్తూ ఆర్డినెన్స్‌లో పొందుపరచడంతోపాటు ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై జీహెచ్ఎంసీకి ఉన్న విస్తృత అధికారాలను హైడ్రాకు వర్తింపజేయడంపై వివిధ విభాగాల అధికారుల్లో చర్చ జరుగుతున్నది.