దుండిగల్, మార్చి 4: హైడ్రా మరోసారి చిరు వ్యాపారుల బతుకును ఛిన్నాభిన్నం చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉపాధి పొందుతున్న వారి వ్యాపార దుకాణాలను అధికారులు నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. దీంతో నిజాంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2 నుంచి బాలాజీహిల్స్కాలనీ, కేటీఆర్కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇందిరమ్మ కాలనీవాసులు చిరు వ్యాపారాల కోసం రేకులషెడ్డులను ఏర్పాటుచేసుకున్నారు. వీటి మీదనే వారి బతుకు ఆధారపడి ఉన్నది. ఈ నిర్మాణాలను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హైడ్రా అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య వచ్చి జేసీబీలతో కూల్చివేశారు.
కొద్దిసేపు కూల్చివేతలను స్థానికులు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్లు తీసుకుంటామని వేడుకున్నా అధికారులు కనికరించలేదని ఇందిరమ్మ కాలనీవాసులు విలపించారు. వృద్ధులమైన తాము చిన్నపాటి కొట్టును అప్పుచేసి ఏర్పాటు చేసుకున్నామని, ఆ అప్పు తీరక ముందే అధికారులు తమ ఇంటి ముందర షెడ్డును కూల్చివేశారంటూ వృద్ధ దంపతులు విలవిలలాడారు. 70 ఏండ్లు పైబడిన వయసులో తాము ఎలా బతకాలంటూ విలపించారు. మరోవైపు, కూల్చివేతలను నిరసిస్తూ కాలనీవాసులు బాలాజీహిల్స్కాలనీ కమాన్ వద్ద రోడ్డుకు అడ్డంగా సామాన్లు వేసి బైఠాయించారు. ప్రభుత్వానికి తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. కనీసం ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే సామాన్లు తీసి బయట పెట్టుకునే వారమని వాపోయారు. తమకు ఇండ్లు ఇచ్చుడేందుకు, కూల్చుడెందుకు? తాము ఇప్పుడు ఎక్కడ తల దాచుకోవాలంటూ పలువురు విలపించారు. దళితులు, గిరిజనులమైన తమపై ప్రతాపం చూస్తున్న అధికారులు మిగతా వారిపట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారని మండిపడ్డారు.