HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ/పటాన్చెరు, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ): హైడ్రా కూల్చివేతలు సామాన్యుడి బతుకును ఆగం చేస్తున్నాయి. ప్రజాపాలనలో సమయం, సందర్భం లేకుండా దూసుకువస్తున్న హైడ్రా బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. చట్టం తమ చుట్టం అన్నట్టు ఉన్నోడికో న్యాయం, లేనోడికి మరో న్యాయం అన్నట్టుగా కూల్చివేతల్లో హైడ్రా ద్వంద్వ వైఖరి కొనసాగిస్తూ వస్తున్నది. తెల్లవారుజామున జనం నిద్ర లేవకముందే సామాన్యుల ఇండ్లు, చిరు వ్యాపారుల దుకాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్నది. ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలోని ప్రభుత్వ స్థలాలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న 16 ఆక్రమణలను తొలగించింది. ఈ మూడు చోట్ల కలిపి 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రక్షించినట్టు హైడ్రా ప్రకటించింది. ఈ కూల్చివేతల్లో సామాన్యుడే మరోసారి సమిధగా మారాడు.
అమీన్‌ఫూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడ, కృష్టారెడ్డిపేట గ్రామాల్లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఆదివారం ఉదయం నుంచి హైడ్రా ప్రత్యేక బలగాలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు మధ్య వచ్చి జేసీబీలు, బుల్డోజర్లు, ప్రత్యేకంగా తెప్పించిన హిటాచీ వాహనంతో కూల్చివేతలు ప్రారంభించారు. కృష్టారెడ్డిపేట గ్రామంలో సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మూడు భారీ కమర్షియల్ కాంప్లెక్స్ భవనాల కూల్చివేత ప్రారంభించారు. అక్కడ ఎకరా స్థలం ఆక్రమణకు గురైనట్టు అధికారులు తెలిపారు. అక్కడే మూడు రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దవాఖానను నేలమట్టం చేశారు. బాధితులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు నెట్టివేశారు. రెండు నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు మూడోది కూడా కూల్చే వెళ్తామని స్పష్టం చేశారు. పటేల్‌గూడలోని సర్వే నంబర్ 12/2, 12/3 ప్రభుత్వ భూమిలో 3 ఎకరాల స్థలం అన్యాక్రాంతం అయిందని హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటీవలే ఈ కాలనీలో గృహప్రవేశాలు జరిగాయి. సాయంత్రం వరకు హైడ్రా బృందం 25 విల్లా భవనాలను నేలమట్టం చేసింది.
కూకట్పల్లి నల్ల చెరువు విస్తీర్ణం 30 ఎకరాలు కాగా 7.36 ఎకరాల స్థలం మాత్రమే చెరువు శిఖం భూమి ఉంది. మిగిలిన స్థలానికి పట్టా కలిగిన ప్రైవేటు వ్యక్తులు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి భవనాలు, రేకుల షెడ్లను నిర్మించారు. మరికొందరు అమ్మేసుకున్నారు. కొందరు కిరాయిలకు ఇచ్చారు. ఈ రేకుల షెడ్లకు వారు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. నల్ల, విద్యుత్తు కనెక్షన్ కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు వచ్చి కూల్చివేయడంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఈ ప్లాట్ల విషయంలో యజమానులకు కాకుండా కిరాయిదారులకు శిక్ష పడింది.
ఇక్కడ నివాసముంటున్న వారిలో చాలామంది సొంత ఖర్చులతో నిర్మించుకున్న రేకుల షెడ్డులలో టెంట్‌హౌస్‌లు, క్యాటరింగ్, ఫ్లెక్సీ తయారీ వంటివాటిని ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వారి జీవితాలన్నీ చెల్లాచెదురైపోయాయి. నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేయడంతో గుండెలవిసేలా విలపిస్తున్నారు. తెలియక షెడ్లు నిర్మించుకున్నామని, వాటిని తొలగించుకుని, అందులోని సామాన్లను తీసుకునే సమయం ఇవ్వాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. దీంతో లక్షల విలువ చేసే వస్తువులు నాశనమైపోయినట్టు చెప్తూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు.
పటేల్‌గూడ, కృష్ణారెడ్డిపేట ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీలోకి విలీనమయ్యాయి. ఈ గ్రామాలు పంచాయతీలుగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల్లోనూ వెంచర్లు వేసి డూప్లెక్స్ బిల్డింగ్లు నిర్మించారు. హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య వచ్చి వాహనాల రాకపోకలను నియంత్రించి వీటిని కూల్చివేశారు. ఇటీవలే ప్రారంభించిన పిల్లల దవాఖానను కూడా కూల్చివేశారు. వాణిజ్య సముదాయాల కూల్చివేతల సమయంలో హైకోర్టు స్టే ఉందని యజమానులు చెప్తున్నా అధికారులు పట్టించుకోలేదు.
‘దేవుడా! ఇంత అన్యాయమా. నువ్వు వస్తే బాగుంటుందని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇంత అన్యాయం చేస్తావా? నా కొడుకు లక్షల్లో అప్పులు తెచ్చి రేకుల షెడ్డు నిర్మించుకుని, క్యాటరింగ్ పనులు చేస్తూ రూపాయి రూపాయికి గోసపడుతున్నాం. ఇప్పుడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం.జీవితాంతం కోలుకోలేని దెబ్బ వేశావు దేవుడా?’ అని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. మహబూబ్‌నగర్‌లోని ఓ మారుముల ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన గాండ్ల రమేశ్.. భార్య మానస, తల్లి ఆదిలక్ష్మి, తండ్రి ఆనంద్‌కుమార్‌తో కలిసి ఇక్కడ నివసిస్తున్నాడు. నల్లచెరువు సమీపంలోని ఓ ఖాళీ స్థలాన్ని 6 ఏండ్లకు లీజుకు తీసుకున్నాడు. యజమానికి లక్ష రూపాయల అడ్వాన్స్, ప్రతి నెల రూ. 30,500 కిరాయి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఖాళీ స్థలంలో కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి రేకుల షెడ్డు, వంటసామగ్రి పెట్టుకున్నాడు. రెండేండ్లు ఆ కుటుంబమంతా కష్టపడటమే కాకుండా మరో పదిమందికి ఉపాధి కూడా కల్పించారు. నెలనెలా మిత్తీలు, యజమానికి కిరాయి, జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను చెల్లిస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం ఒక్కసారిగా వచ్చిన హైడ్రా అధికారులు వారి గూడును కూల్చేయడంతో కట్టుబట్టలతో కుటుంబం రోడ్డున పడింది.
సూర్యాపేట జిల్లా తొర్రూరుకు చెందిన గుగులోత్ రవి.. భార్య విజయ, ముగ్గురు కూతుళ్లు, కొడుకుతో నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. నల్ల చెరువు సమీపంలో ఓ ఖాళీ స్థలాన్ని కిరాయికి తీసుకుని రేకుల షెడ్డు నిర్మించుకున్నాడు. అందులో జీఆర్ సింబల్స్ డిజిటల్స్ పేరిట ఫ్లెక్సీ తయారీషాపు పెట్టుకున్నాడు. షెడ్డు నిర్మాణానికి, ప్రింటింగ్ మిషన్‌కు కలిపి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం హైడ్రా అధికారులు వచ్చి ఒక్కసారిగా షెడ్డును కూల్చివేయడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయన భార్య, పిల్లలు వేడుకున్నా అధికారులు కనికరించలేదు.
ఎవరిపైనా ఆధారపడకుండా బతకాలని అప్పుచేసి రేకుల షెడ్డు నిర్మించుకుని క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నా. నాతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నా. నన్ను ఇప్పుడు రోడ్డున పడేశారు. కూలగొట్టడానికి ముందు నోటీసులు, సమయం ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఇప్పుడు అంతా కోల్పోయి రోడ్డున పడ్డా. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు. మాలాంటోళ్లను ఇబ్బంది పెట్టే వారిని దేవుడే చూసుకుంటాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ స్థలాలు, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలసిన అక్రమ కట్టడాలను ఆదివారం కూల్చివేసి 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వ్యాపారం కోసం నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చివేశామని, నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్లలేదని పేర్కొన్నారు. కూకట్పల్లి నల్లచెరువులోని సర్వే నంబర్ 66, 67, 68, 69లోని మొత్తం 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీలు కూల్చివేసి మొత్తం నాలుగు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోనూ అక్రమణలను కూల్చివేశామని, కిష్టారెడ్డిపేటలోని సర్వే నంబర్ 164లో మూడు భవనాలను కూల్చేసినట్టు చెప్పారు. వాణిజ్యపరంగా వినియోగిస్తున్న ఐదంస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేసి, అక్కడ ఎకరం భూమిని స్వా ధీనం చేసుకున్నామని, పటేల్‌గూడ సర్వే నంబర్ 12/2, 12/3లోని 25 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల భూమిని రక్షించినట్టు రంగనాథ్ తెలిపారు.
దేవుడా! ఇంత అన్యాయమా! నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇంత అన్యాయం చేస్తావా రేవంత్? నా కొడుకు లక్షల్లో అప్పులు తెచ్చి రేకుల షెడ్డు నిర్మించుకుని, క్యాటరింగ్ పనులు చేస్తూ అప్పు తీర్చేందుకు రూపాయి రూపాయికి గోసపడుతున్నం. ఇప్పుడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నం. జీవితాంతం కోలుకోలేని దెబ్బవేశారు. ఈ సర్కారు మా సావుకొచ్చింది.
– ఆదిలక్ష్మి
రేవంత్‌రెడ్డిని నమ్మి ఓట్లేస్తే రోడ్డున పడేశారు. యజమానిని కాకుండా కిరాయిదారులను శిక్షిస్తే ఎలా? ముందుగా చెబితే సామగ్రి తీసుకుని ఉండేవాళ్లం. అధికారుల కాళ్లకు మొక్కిన వినలేదు. నా కోడలు గర్భవతి. ఇప్పుడు మా గూడు కూల్చేస్తే మేం ఎలా బతకాలి. దేవుడు వీరిని తప్పకుండా శిక్షిస్తాడు. నా కొడుకు కష్టార్జితంతో నిర్మించుకున్న రేకుల షెడ్డును కూల్చిన రేవంత్‌కు పుట్టగతులుండవు.
– ఆదిలక్ష్మి, రమేశ్ తల్లి
బతుకుదెరువు కోసం షాపు పెట్టుకుని పనిచేసుకుంటున్నా. చెరువులో నిర్మాణం అయితే నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పాలి. మేము వినకుంటే అప్పుడు వచ్చి కూల్చాలి. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి కూల్చేస్తే మేం రోడ్డున పడ్డాం. ప్రభుత్వం పేదలను ఆదుకోవాలి కానీ, ఇలా రోడ్డున పడేస్తే ఎలా? ఇంత ఘోరం ఎక్కడా చూడలేదు. తప్పుచేసిన వారిని శిక్షించాలి కానీ, మాలాంటి పేదోళ్లకు అన్యాయం చేయడం తగదు.
– గుగులోత్ రవి, జీఆర్ సింబల్స్ డిజిటల్స్
మూడు రోజుల క్రితమే ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అంతలోనే మా ఇంటిని కూల్చివేశారు. మేము కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు. రిజిస్ట్రేషన్‌కు ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం. అనుమతులు అన్నీ ఉన్నాయని ఇల్లు కొన్నాం. ఇల్లు కూల్చుతామని అధికారులు వచ్చి చెప్పడంతో షాకయ్యాం. ఏండ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్నాం. కొంత బ్యాంకు లోను కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు, అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని మాలాంటి బాధితులకు న్యాయం చేయాలి.
-శివారెడ్డి దంపతులు, పటాన్చెరు