ఈ ఫొటో గుర్తుందా? హైడ్రా దారుణాలకు, బాధితులకు ఊపిరి తీసుకునే అవకాశమూ ఇవ్వని కాంగ్రెస్ సర్కారు నిరంకుశత్వానికి ఈ దృశ్యమే ఓ ఉదాహరణ. హైడ్రా బుల్డోజర్లు కండ్లముందే కలల ఇంటిని కర్కశంగా నేలమట్టం చేస్తుంటే అసహాయుల ఆక్రందన నేటికీ కండ్లముందే కదలాడుతున్నది. ఓ పీడకలగా నేటికీ వెంటాడుతున్నది.
లేని ఇంటికి ఈఎంఐ కట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అట్ల రుణగ్రస్తమై కూలిన కలల భారాన్ని నేటికీ మోస్తున్నది ‘హైడ్రా’బాద్‌లో హైడ్రా బాధితులే. అమ్మిన బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలుండవు. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఉండవు. ప్రభుత్వ ముసుగులో పేదోడి బతుకుతో ఆడుతున్న చెలగాటమిది!
మీరే పర్మిషన్లు ఇచ్చి, మీరే కూల్చేస్తే ఎలా? నష్టపరిహారం ఇచ్చేదెవరు? మా కష్టం తీర్చేదెవరు? పోనీ మా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని హైడ్రానో, ప్రభుత్వమో అధికారికంగా ఓ సర్టిఫికెట్ ఇవ్వగలదా?’ ఇదీ కత్వాచెరువు వద్ద ఇల్లు కోల్పోయిన శశాంక్ ఆవేదన. ఆయన ప్రశ్నకు జవాబుందా?
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): నిరుడు మల్లంపేటలోని (Mallampet) కత్వా చెరువు వద్ద హైడ్రా సృష్టించిన విధ్వంసానికి మధ్యతరగతి ప్రజలు పడ్డ ఇబ్బందులకు నిదర్శనమిది. కోటి రూపాయల పెట్టుబడితో తాము ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లోకి వస్తే ఒక్కరోజులోనే హైడ్రా (HYDRA) ఇల్లు మొత్తం నేలమట్టం చేసిందని శశాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పినా వినకుండా మీ బిల్డర్‌తో మాట్లాడుకోండని అందరినీ బయటకు పంపించి విల్లాలు కూల్చేసిన హైడ్రా ఇప్పటివరకు ఒక్క బిల్డర్పైన అయినా కేసు పెట్టిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ పేద ప్రజల ఇండ్లను టార్గెట్‌గా చేసుకుని వారిపైన హైడ్రా బుల్డోజర్లను పంపిస్తుందని, రాబోయే రోజుల్లో తమకు న్యాయం చేయడానికి వచ్చే ప్రభుత్వమైనా చర్యలు తీసుకుంటుందని ఆశతో ఉన్నామంటూ ‘నమస్తే తెలంగాణ’తో శశాంక్ తన ఆవేదనను పంచుకున్నారు. విల్లా కోల్పోయి అద్దెలు కడుతూ మోయరానంత భారం మోస్తూ అప్పుల పాలవుతున్నామంటున్న శశాంక్ ఆవేదన ఆయన మాటల్లోనే.. ఎంతో ఇష్టంగా విల్లా తీసుకున్నం.
అప్పటి వరకు కలగా ఉన్న సొంత ఇల్లు వచ్చిందన్న సంతోషం ఎక్కువకాలం లేకుండానే పోయింది. హైడ్రా వచ్చి మా కలలను చిదిమేసింది. కోటి రూపాయల లోన్ తీసుకుని కట్టుకున్న ఇల్లు పోయింది. జాగా ఉన్నా లేనట్లే. కేవలం డాక్యుమెంట్స్ పట్టుకుని తిరుగుతు న్నం. నెల తిరగగానే రూ. లక్ష ఈఎంఐ వస్తున్నది. మేము అద్దె ఇంట్లో ఉంటుంటే దాని రెంట్ రూ.25వేలు. నెలకు రూ.లక్షన్నర అ న్యాయంగా మా మీద పడుతుంటే ఏం చేయా లో తోచక అధికారుల చుట్టూ ,కోర్టు చుట్టూ తిరుగుతున్నం తప్ప ఎక్కడా న్యాయం జరగడం లేదు. బిల్డర్‌ను అడగమని చెప్పింది కరెక్టే కానీ అసలు ఇప్పటివరకు హైడ్రా ఒక్క బిల్డర్పైన అయినా కేసు పెట్టి బాధితుల పక్షాన నిలబడిందా? కేవలం కూల్చుకుంటూ పోతున్నది. ఆ తర్వాత తనకేం అవసరం.. అన్నట్టు చూస్తున్నది తప్ప బాధితులకు న్యాయం ఎలా చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండొ ద్దా? కన్నతల్లి మరణిస్తే ఎంత బాధ ఉంటుం దో సొంత ఇల్లు కండ్ల ముందే కూలగొడ్తుంటే అంత బాధ పడుతున్నం.
లేని ఇంటికి ఈఎంఐలు కడుతున్నం. అద్దె ఇళ్లల్లో ఉంటున్నం. నెలకు రూ. లక్ష లోన్ వాయిదాలు కడుతుంటే మా పరిస్థితి ఏంటి. లేని ఇంటికి లోన్ ఎలా కట్టాలి సార్ అని బ్యాంక్ అధికారులను అడిగితే మాకు ఏం తెలియదు. మీరు హైడ్రా నుంచి కానీ, ఎమ్మార్వో, వీఆర్వో, సబ్‌రిజిస్ట్రార్.. ఇలా వీళ్లెవరి దగ్గరి నుంచైనా వీళ్ల భూమి స్వాధీనం చేసుకున్నామని సర్టిఫికెట్ తీసుకురండి. అప్పుడు లోన్ క్యాన్సిల్ చేయడానికి మా హెడ్ ఆఫీసుకు ప్రపోజల్ పంపుతామని చెప్పారు. ఇదే విషయం హైడ్రాకు చెప్తే మాకేం సంబంధం. మీరు బిల్డర్‌పై కేసు పెట్టండన్నారు. మేం తీసుకున్న లోన్ సొమ్ము బిల్డర్ ఖాతాలో పడింది. మరి వాళ్లపై ఒత్తిడి చేసి మాకు న్యాయం చేయాలనే ఆలోచన ప్ర భుత్వానికి ఉందా? మేమే పూనుకుని బిల్డర్‌ను విదేశాలకు పోనీయకుండా లుక్ఔట్ నోటీసు ఇప్పించి పట్టుకొచ్చి పోలీసులకు అప్పగిస్తే బెయిల్‌పై వచ్చి మంచిగ తిరుగుతుంది. మా పరిస్థితి ఏంది. మేం ఎలా బతకాలి? అప్పులు ఎలా కట్టాలి? ఏళ్ల తరబడి లేని ఇంటికి డబ్బు లు కట్టడమంటే ఇంతకంటే దారుణం ఉం టుందా, బ్యాంక్ వాళ్లు అడిగిన స్వాధీనం సర్టిఫికెట్ ఎవరిస్తారు? కూల్చేసిన హైడ్రా మాకేం సంబంధం అంటూ చేతులెత్తేసింది.
సబ్‌రిజిస్ట్రార్‌ను అడిగితే!
మా పరిస్థితేంటని సబ్‌రిజిస్ట్రార్‌ను అడిగితే ఆ స్థలంలో ఒక షెడ్ వేసుకుని పూలమొక్కలు పెంచుకోమని సలహా ఇచ్చారు. అది సాధ్యమవుతుందా? అసలు వాళ్లేం చెప్తున్నారో, అధికారులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వాళ్లపైనే ఎందుకు పగబట్టిందో అర్థం కావడం లేదు. సబ్‌రిజిస్ట్రార్ చెప్పినట్టు అక్కడ మేం షెడ్ వేస్తే హైడ్రా ఊరుకుంటుందా? హైడ్రా ప్రకారం ఇల్లు కట్టుకోవద్దు. లేని ఇంటికి లోన్ కట్టాల్సిందే. ఒకవేళ కట్టకపోతే సిబిల్ పోతుంది. ఎలాగోలా బ్యాంక్ వాళ్లు రికవరీ చేస్తారు. మాకు రిమార్క్ ఉంటుంది. మా భవిష్యత్తును ప్రమాదంలో పడేసిన హైడ్రాకు ఇది న్యాయమవుతుందా? ఇవాళ మా విల్లా విలువ రూ. 2.5కోట్లు. ఇవి ఎవరిస్తారు? హైడ్రాకు వెళితే మీ బాధ చూశాం కానీ మేం చేసేది చేశాం. ఒక కమిటీ వేసి మీ సమస్యలు వింటామంటూ చెప్పారు. మా కాగితాలన్నీ చూసి అధికారుల తప్పని తేల్చారు. అయితే అక్కడ అధికారుల తప్పైనా, బిల్డర్ తప్పైనా బాధితులం మేమే కదా. మరి మాకు న్యాయం ఎవరు చేస్తారు. బిల్డర్ దగ్గర నుంచి ప్రభుత్వం రికవరీ చేయాలి ఆ విషయంలో అసలు సర్కార్‌కు పట్టింపే లేదు. ఎక్కడ కూడా బిల్డర్లను ముట్టుకోరు. వాళ్లను కాకుండా వాళ్ల దగ్గర కొనుగోలు చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారు. ఇదేం విధానం.
హైడ్రా బాధితుల ఏడుపులపై వెటకారమా
హైడ్రా కూల్చివేతల బాధితుల ఏడుపులు దొంగ ఏడుపులంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ అనడం బాధగా ఉంది. ఆయనను ఒకసారి మల్లంపేటకు రమ్మనండి. కెమెరాలతో పాటు వచ్చి మా బాధలు చూస్తే తెలుస్తుంది. మావి దొంగ ఏడుపులా, నిజమైనవా అని వాళ్లే తేల్చాలి. రాజకీయాల కోసం మా బతుకులు రోడ్డు మీద వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనాల్సింది పోయి పేద, మధ్యతరగతి వాళ్లమైన మా సొంతింటి కలను చిదిమేసిన హైడ్రాను అనాల్సింది మరిచిపోయి వాళ్లకు అనుకూలంగా ఎలా మాట్లాడతారు. పద్దెనిమిది విల్లాలు ఒక్కోటి రెండున్నర కోట్లు. మొత్తం రూ. 45 కోట్ల సొమ్ము మొత్తం నేలమట్టమైంది. పైగా అదంతా లేకున్నా కడుతున్న మాపై వెటకారాలు ఆడటానికి ఆయనకు మనసెలా వచ్చింది. రేవంత్‌రెడ్డి కొన్ని వేల కోట్ల విలువ చేసే జాగా స్వాధీనం చేసుకున్నామన్నారు. అది ఎవరిదగ్గర ఎవరి భూమి స్వాధీనం చేసుకున్నారు.. ఎవరు ఆక్రమణ దారులు. దీనిపై ఎలాంటి విచారణ లేకుండా ఏదీ తేల్చకుండా మాట్లాడుతున్నారు. ముందు మా సమస్యకు పరిష్కారం చూపకుండా తప్పించుకుపోతున్నారు. హైడ్రా ఇలాగే ఉంటే ఇంకా ఎన్నో ఇండ్లు కూలిపోతాయి. ఎప్పటికైనా హైడ్రా కూల్చివేతలతో బాధపడుతున్న మాలాంటి వారికి వారు సమాధానం చెప్పాల్సిందే.