Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 ( నమస్తే తెలంగాణ ): ‘మూసీ పరివాహక ప్రాంతాల కన్నీటి వ్యథ ఎవరికీ చేరొద్దు.. గూడు చెదిరిందని ఏడవొద్దు.. రోడ్డున పడ్డామని బాధపడొద్దు.. బాధితుల కష్టాన్ని నొక్కిపెట్టాలి. అందుకోసం మూసీవాసులకు ఇబ్బందులే లేవనేలా.. ప్రజలంతా కూల్చివేతలను హర్షిస్తున్నారనేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను నియంత్రించాలి.’ ఇప్పుడు ఇదే లక్ష్యంతో రేవంత్ సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. మూసీ నిర్వాసితుల ఆర్తనాదాలను తుడిచిపెట్టడానికి సోషల్ మీడియా వేదికల ద్వారా రంగంలోకి దిగింది. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేయడానికి సమాయత్తమైంది. ఇప్పటికే మైండ్‌స్పేస్ వద్ద కార్యాలయం ఏర్పాటు చేశారు. ఫేక్ వీడియోలు చేసి ప్రచారం చేయడానికి 300 మందిని రిక్రూట్ చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి 45 వేల నుంచి 80 వేల వరకు జీతం ఇస్తున్నారని సమాచారం.
మూసీ కూల్చివేతల ప్రక్రియ రోజురోజుకు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. అభాగ్యుల ఇండ్లను కూల్చడంపై సమస్త సమాజం వ్యతిరేకిస్తున్నది. శత్రుదేశంపై దాడి చేసినట్టుగా కూల్చివేయడంపై జాతీయస్థాయిలో రేవంత్ సర్కార్ విమర్శలు ఎదుర్కొంటున్నది. రాజకీయ పార్టీలు కూడా మూసీ ఇండ్ల మార్కింగ్‌ను తప్పుపడుతున్నాయి. సామాజికవేత్తలు, నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. వందల ఎకరాల్లో కబ్జా పెట్టిన భవంతులను వదిలేసి పేదోళ్ల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపడం ఏమిటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో రేవంత్ సర్కార్ కూల్చుతున్న ఇండ్లకు సబంధించిన ఆర్తనాదాల వీడియోలు ప్రపంచదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లందరికీ చేరుతున్నాయి. ఎన్ఆర్ఐల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. రేవంత్ సీఎంగా పనికిరాడు.. పాలించడం తెలియడం లేదని భావిస్తున్నారు. ఈ పరిస్థితులు సీఎం రేవంత్‌రెడ్డిని కంటి మీద కునుకు లేకుండా చేశాయి. సొంత పార్టీలోనూ వ్యతిరేకత వస్తుంది. మూసీ ఇండ్ల జోలికి వెళ్లి ఉండకపోయుంటే బాగుండేదని సన్నిహితులు సైతం చర్చించినట్టు సమాచారం. ఇలాంటి స్థితిలో రేవంత్ రెడ్డి ఆ వ్యతిరేకతను తగ్గించడానికి సోషల్ మీడియా టీంలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతలు సబబే అనేల వీడియోలు చేయించేలా ప్రణాళికలు చేస్తున్నారు. బాధితుల్లో ఉబికి వస్తున్న కన్నీటికి ఎన్ని సోషల్ మీడియా అకౌంట్లు అడ్డుకోలేవని రేవంత్ టీమ్ తెలుసుకోవాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.