హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్లది కీలక పాత్ర! ఈ ఇద్దరు ఒకే అంశంపై విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంమైంది. ఇద్దరూ ఒకే వేదికపై ఒకే అంశంపై విరుద్ధ ప్రకటనలు చేయడం గందరగోళానికి గురిచేసింది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఇంటి నిర్మాణానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులను గౌరవించాల్సిందేనని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ చెబితే.. కాదు కాదు ఆ అనుమతులను రద్దు చేయిం చి మరీ కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం గమనార్హం. శనివారం సచివాలయంలో మూసీ సుందరీకరణ కోసం బాధితుల తరలింపు, హైడ్రా కూల్చివేతలపై విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఇంటి నిర్మాణాల అనుమతులు, కూల్చివేతలపై విరుద్ధ ప్రకటనలు చేశారు. తొలుత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతు లు గల ఇండ్లను కూల్చివేయడం లేద ని చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనా థ్, ఆ తర్వాత అనుమతులను రద్దు చేయించి మరీ కూల్చివేస్తామని ప్రకటించడం గమనార్హం. ఆ తర్వాత మాట్లాడిన దానకిశోర్.. అక్కడక్కడా తప్పిదాలు జరుగుతాయని ఒప్పుకొంటూనే ఆ అనుమతులను గౌరవించాల్సిందేనని, ఈ అంశంపై ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా తెలిపారు. ఇలా కీలక అంశంపై కీలక అధికారులు విరుద్ధ ప్రకటనలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా విధివిధానాలపై కీలక అధికారులకే స్పష్టత లేకుంటే కింది స్థాయి అధికారుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.