కోర్టులకు సెలవు వచ్చే ఒక్క రోజు ముందే హైడ్రాకు శిగమొస్తుంది. ఎప్పటిలానే శనివారం తెల్లవారుజామున ఈ సారి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ మీద విరుచుకుపడింది. జనాలు లోపల ఉండగానే అపార్ట్‌మెంట్‌పైకి భారీగా పోలీసు బలగాలను అడ్డం పెట్టుకొని బుల్డోజర్లతో దండెత్తింది.
ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. కనీసం ఇంట్లోని సామగ్రిని కూడా తీసుకోనివ్వకుండా ఆరు అంతస్తుల అపార్ట్మెంట్లోని 45 ఫ్లాట్లలో ఉంటున్నవారిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది. అత్యుత్సాహంతో పైనుంచే వస్తువులను కింద పడేసింది. ఓవైపు హైడ్రా బుల్డోజర్ అపార్ట్‌మెంట్‌ను కూలుస్తుండగానే బాధితులు ఒక్కో సామగ్రిని కిందికి దించుకోవడం కనిపించింది. మరోవైపు రెండేండ్లుగా ఉంటున్న నివాసాన్ని కూల్చి తమను ఉన్నపళంగా వెళ్లిపొమ్మంటే ఎక్కడికి పోయేదని అపార్ట్‌మెంట్‌వాసులు గుండెలు బాదుకుంటూ రోదించారు.
పిల్లలు లోపలే ఉన్నా బుల్డోజర్తో నివాసాలను కూల్చుతుండగా ఆగ్రహం కట్టలు తెంచుకొని అధికారులపైకి తిరగబడ్డారు. స్థానికుల ఆందోళనకు దిగివచ్చిన అధికారులు సామగ్రి తీసుకునేందుకు కేవలం రెండు గంటల సమయం ఇచ్చారు.
హైదరాబాద్ సిటీబ్యూరో/అమీన్పూర్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): ‘ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఉన్న ఇండ్లు కూలగొడితే మేం ఎక్కడికి పోవాలి. రేవంత్‌రెడ్డి గెలిచిన దగ్గరి నుంచి మా పేదోళ్ల కడుపుల మీద కొడుతున్నడు. మమ్మల్ని చెట్ల కింద కూడా బతకనిచ్చేలా లేడు’ అంటూ ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతల బాధితులు ఆక్రోశిస్తున్నారు. సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా తమను ఇండ్ల నుంచి బయటకు పంపించి కూల్చేశారని విలపిస్తున్నారు. ‘ఇప్పటికిప్పుడు మాకు ఇల్లు ఎవరిస్తారు? హడావుడిగా వచ్చి ఉన్న ఇల్లు కూలగొట్టి కట్టుబట్టలతో వెళ్లగొడ్తే మేం రోడ్డునపడ్డాం.. ఇప్పుడేం చేయాలె? ఎలా బతకాలె..?’ అంటూ హైడ్రా చర్యలపై ఓ యువతి ఆవేదన వ్యక్తంచేశారు.

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు శనివారం పెద్దఎత్తున కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఓ ఆరంతస్తుల భవనాన్ని, ఓ గెస్ట్‌హౌస్‌ను నేలమట్టం చేశారు. సర్వేనంబర్-1 నుంచి 220 వరకు 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో పలు రకాల కోర్టు వివాదాలు కొనసాగుతుండగా.. కొందరు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని హైడ్రా తెలిపింది. ఆ నిర్మాణాలు తొలగించే క్రమంలో హైడ్రా కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ అపార్ట్‌మెంట్‌ను, గెస్ట్‌హౌస్‌ను కూల్చివేసింది. కూల్చివేతకు ముందు మున్సిపల్ అధికారులు నీరు, కరెంట్‌ను కట్ చేశారు. కోర్టు స్టే ఉత్తర్వులు 1998 నుంచి ఉన్నప్పటికీ బిల్డర్లు ఈ భవనాలను అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. ముఖీమ్ అనే వ్యక్తి గెస్ట్‌హౌస్ నిర్మించగా, అతని సోదరుడు అజీమ్ ఎలాంటి అనుమతులు లేకుండా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారని తెలిపారు. ఈ అరంతస్తుల భవనంలో 40 ఐదు కుటుంబాలు నివసిస్తున్నాయి.

హైడ్రా సిబ్బంది పలకరింపుతోనే అపార్ట్మెంట్లోని వారికి శనివారం తెల్లవారింది. తెల్లవారు జామునే జేసీబీలతో అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది ఉదయం ఆరు గంటలకు అందరినీ ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో పలువురు తమ ఇంటి తలుపులు వేసుకున్నారు. అయినప్పటికీ హైడ్రా సిబ్బంది పెద్దగా కేకలు వేస్తూ తమ కిటికీలు పగులగొట్టి బయటకు వెళ్లాలని తమను బలవంతపెట్టారని బాధితులు ఆరోపించారు. హైడ్రా చర్యలతో భయాందోళనకు గురైన బాధితులు.. బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోంచి బయటకు వచ్చి తమకు అన్యాయం చేయొద్దంటూ వారిని బతిమిలాడుకున్నారు. ఇలా అకస్మాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. సమాచారం లేకుండా కనీసం తమ సామాను బయటకు తీసుకొనిరాకుండా ఎలా కూల్చేస్తారంటూ నిలదీశారు. చిన్నపిల్లలను, వృద్ధులను తీసుకొని ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోవాలని మండిపడ్డారు. ఓవైపు వాదనలు కొనసాగుతుండగానే హైడ్రా సిబ్బంది ఐదో అంతస్తు నుంచి సామాన్లు కిందికి విసిరేయడం ప్రారంభించారు. దీంతో బాధితులు పెద్దపెట్టున ఎదురుతిరిగారు. దాంతో కొంత వెనక్కి తగ్గిన హైడ్రా ఇండ్లు ఖాళీ చేసేందుకు రెండు గంటల సమయం ఇచ్చారు. పిల్లలను, వృద్ధులను, సామాన్లను తరలించేందుకు వారు నానా ఇబ్బందులు పడ్డారు. తమకు ఇండ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వకుండా తెల్లవారకముందే వచ్చి తమను బలవంత పెట్టడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తిండీతిప్పలు లేకుండా మధ్యాహ్నం మూడు గంటల వరకు వారు ఇండ్లు ఖాళీ చేశారు. ఆ వెంటనే అధికారులు భవనాన్ని కూల్చివేయడం ప్రారంభించడంతో బాధితుల రోదనలు మిన్నంటాయి. తమకు న్యాయం చేయాలంటూ వారు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

2
ఐలాపూర్‌లో తెల్లవారుజామునే హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టడం పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలంటూ పెద్ద భవనాలను కూల్చివేసే క్రమంలో హైడ్రా దూకుడు ప్రదర్శించింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపూర్‌లో మొత్తం 1263 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ, లేఅవుట్, కొందరు వ్యక్తుల మధ్య కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. గత కొన్నేండ్లుగా ఈ వివాదాలకు సంబంధించి కోర్టు యథాతథస్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొందరు నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా వాటిపై దృష్టి పెట్టింది. 1263 ఎకరాల్లో 860 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ ఫెన్సింగ్ వేశారు.
ఐలాపూర్‌లో ఉదయం ఆరు గంటల నుంచే హైడ్రా, పోలీసులు భారీగా మోహరించారు. మూడువందల మంది వరకు హైడ్రా, పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పోలీసులు ఒక్కసారిగా ఐలాపూర్‌కు చేరుకోవటంతో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైడ్రా ఎస్పీ సుదర్శన్, సీఐ బాలగోపాల్తోపాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీఐలు నరేశ్, రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు.

బీఆర్ఎస్ నేత ఐలాపుర్ మాణిక్‌యాదవ్ కార్యాలయాన్ని కూడా అధికారులు కూల్చివేయించారు. ప్రభుత్వ భూమిలో ఫాంహౌస్, బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని ఆరోపిస్తూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలను మాణిక్‌యాదవ్, ఆయన కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌తో దిగిన ఫొటోతో బయటకు వచ్చిన మాణిక్‌యాదవ్ రోదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాతల కాలం నుంచి ఈ భూమిలో తాము నివాసం ఉంటున్నామని తెలిపారు. కోర్టు పరిధిలో ఈ స్థలం వివాదం ఉన్నదని చెప్పారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు విచక్షణారహితంగా కూల్చివేతలు చేపట్టడం సరైంది కాదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఇలా జరగలేదని, ఈ విషయమై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను టార్గెట్ చేస్తూ, హైడ్రాను అడ్డంపెట్టుకొని కూల్చివేతలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తుతో కండ్లెదుటే హైడ్రా బుల్డోజర్ కూల్చుతున్న తన నివాసాన్ని చూస్తూ రోదిస్తున్న వృద్ధురాలు
ఓవైపు హైడ్రా బుల్జోజర్ కూల్చుతుండగా కింద పడుతున్న ఇంటి శకలాలు.. మరోవైపు చెల్లాచెదురుగా పడుతున్న సామగ్రి.. ఆటబొమ్మలు.. ఇంకోవైపు కట్టుబట్టలతో రోడ్డున పడి బాధితుల రోదనల నడుమ అసలు ఏం జరుగుతున్నదో తెలియక అమాయకంగా చూస్తున్న చిన్నారి
మా తాత, ముత్తాతల నుంచి ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉంటున్నం. మొన్ననే ఇల్లు కట్టుకున్నం. చెప్పకుండానే మా ఇంటి మీద పడి జేసీబీలతో మొత్తం కూలగొట్టారు. వీళ్లకు మేమేం అన్యాయం చేసినం? మా ఉసురుముడుతది. కష్టపడి కట్టుకున్న ఇంటిని కూలగొడితే ఎంత బాధ ఉంటుందో మీ ఇల్లు కూలగొడితే తెలుస్తది. రేవంత్‌రెడ్డీ.. నాశనమై పోతవ్.
– పద్మ, హైడ్రా బాధితురాలు