HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): చెరువుల ఆక్రమణలు, ఎఫ్టీఎల్ భూముల పరిరక్షణకు మడికట్టుకున్న హైడ్రా.. ఇప్పుడు చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి జనాలు ఉండే నివాసాలపై బుసలు కొడుతూ.. ధనికులు, సంపన్నవర్గాలు, రాజకీయ పలుకుబడి కలిగిన నేతల విషయంలో కోరలు తీసిన పాములా మారిపోయింది.
దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో పదుల ఎకరాల్లో విస్తరించిన అమర్ హౌజింగ్ కో ఆపరేటివ్ సొసైటీకి నెల క్రితమే నోటీసులు జారీచేసిన హైడ్రా.. ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకు అంటే.. అక్కడ ఉన్నది స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి సొంత అన్న ఇల్లు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని ఆగస్టు 8న సీఎం అన్నకు నోటీసులు ఇచ్చినా.. వాటిని ముట్టుకొనే ధైర్యం చేయటం లేదు.
కాంగ్రెస్, టీడీపీ పాలనలోనే చెరువులు అన్యాక్రాంతం అయినట్టు వచ్చిన ఆరోపణలకు అమర్ కో ఆపరేటివ్ సొసైటీ నిదర్శనం. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా నిలిచిన దుర్గం చెరువు 85 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని ప్రాంతాలను పూడ్చివేసి కాలనీలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను దశాబ్దాల క్రితమే నిర్మించారు. అలా ఏర్పడినవే అమర్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, కావూరి హిల్స్, కల్యాణ్‌నగర్, బృందావన్ కాలనీ, హెక్టార్ గార్డెన్ కాలనీలు.
2000లో వచ్చిన వరదలోనూ ఈ ప్రాం తంలోని పలు కాలనీలు నీట మునిగాయని ఇరిగేషన్, రెవెన్యూశాఖలు గుర్తించాయి. అప్పట్లోనే చెరువు భూముల్లో నిర్మించిన భవనాలను వ్యతిరేకిస్తూ కొందరూ కోర్టును ఆశ్రయించగా.. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతుల్లేని భవనాలను ఇరిగేషన్, రెవెన్యూ, హూడా అధికారులు తొలగించారు. కానీ పెద్దల ప్రోద్భలం ముందు అధికారులు ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో ఆక్రమణలపై చర్యలు నిలిచిపోయాయి.
ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆధారాలతో ఈ భూములు రెసిడెన్షియల్ కార్యాకలాపాలకు అనుకూలం కాదని, రీక్రియేషనల్ జోన్‌గా మార్చాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. అయినా ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. కూల్చివేతలతో హడావుడి చేసిన హైడ్రా.. సంపన్నుల భవనాలు, విల్లాలతో నిండిపోయిన అమర్ కో ఆపరేటివ్ సొసైటీకి మాత్రం నోటీసులతో సరిపెట్టింది. ఇప్పటికి నెలన్నర గడిచినా అటువైపు చూడటం లేదు.
అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా తీరు మొదట్నుంచీ అనుమానంగా ఉన్నది. అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో ఉండే సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. కానీ ఆ తర్వాత అటు వైపు కన్నెత్తి చూడలేకపోయారు. కూల్చివేతలు దేవుడెరుగు.. కనీసం ఆయా నిర్మాణాల ఆక్రమణల విస్తీర్ణం కూడా తేల్చలేకపోయారు. సీఎం సోదరుడికీ నోటీసులు ఇచ్చామంటూ చెప్పుకున్నా కూల్చివేతల విషయంలో మాత్రం వెనకడుగు వేసినట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే హైడ్రా నడుస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.
హైడ్రా కూల్చివేతల్లో భాగంగా సున్నం చెరువు వద్ద అధికారులు కరెంట్ కట్ చేయడంతోసోలార్ లైట్ వెలుతురులో చదువుకుంటున్నామని సోలార్ లైట్ చూపిస్తున్న విద్యార్థి
చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల విషయంలో దూకుడుగా వ్యవహారిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సామాన్యుడు నిర్మించుకున్న ఇండ్లపైనే ప్రతాపం చూపుతుందనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. బిల్డర్లు, డెవలపర్లు చేసే తప్పిదాలతో సామాన్యుల కలల సౌధాలను కండ్ల ముందే కూలివేస్తున్నారు. గుండెలు బాదుకొని.. కంటనీరు తెచ్చుకుంటున్నా.. కనికరం లేకుండా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. కానీ రాజకీయ పలుకుబడితో చెరువులను చెరబట్టిన సంపన్నుల నిర్మాణాల జోలికిపోయే ధైర్యం మాత్రం చేయటం లేదు. ఎన్ కన్వెన్షన్ లాంటి నిర్మాణాలను కూల్చివేసి హడావుడి చేసినా.. అమర్ కో ఆపరేటివ్ సొసైటీ లాంటివి హైదరాబాద్‌లో లెక్కకు మించి ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వాటిని గుర్తించింది లేదు. ఒకవేళ గుర్తించినా.. నోటీసులు చేరుతున్నాయి కానీ, బుల్డోజర్లు మాత్రం దరికి రావటంలేదు.
నిబంధనలు అతిక్రమిస్తే ఎంతపెద్ద వారైనా, లీగల్ ఎదుర్కొని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని బీరాలు పోయిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ సొసైటీ విషయంలో దూకుడు ఎక్కడ? అని హైదరాబాద్‌వాసులు ప్రశ్నిస్తున్నారు. జల వనరులను నిర్వీర్యం చేసిన సంపన్నవర్గాల నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదని నిలదీస్తున్నారు. నోటీసులు లేకుండానే నిర్మాణాలు కూల్చివేతలకు దిగుతున్న హైడ్రా.. సంపన్నులు, రాజకీయ నేతలు నిర్మించుకున్న భవంతుల విషయంలో అదే తీరుగా ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తున్నారు. రాత్రికిరాత్రి.. పొద్దుపొద్దగాల.. ఎంతోమంది పేదల ఇండ్లను కూల్చివేసిన హైడ్రా.. నెల అవుతున్నా అమర్ కో ఆపరేటివ్ సొసైటీ నిర్మాణాలను కూల్చివేయడం లేదెందుకు? అని నిగ్గదీసి అడుగుతున్నారు.