LRS | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)పై హైడ్రా ప్రభావం పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులు చిన్న చిన్న కారణాలతోనూ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలు సమీపంలో ఉన్నట్టు తెలిస్తే చాలు.. దరఖాస్తులను ఆమడదూరం పెడుతున్నారు.
ఎఫ్టీఎల్ ఖరారు కాని చెరువులు, కుంటల పరిధిలోని అన్ని సర్వే నంబర్ల దరఖాస్తులను వెనక్కి పంపించేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో షార్ట్ ఫాల్ డాక్యుమెంట్ పేరుతో దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలపై నీటిపారుదలశాఖ అధికారులు ఎన్వోసీ ఇస్తేనే ముందడుగు వేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు ఏ చెరువుకూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఖరారు చేయలేదు. కానీ ఎల్ఆర్ఎస్ పరిశీలిస్తున్న అధికారులు మాత్రం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందేమోనన్న ఉద్దేశంతో ఎన్వోసీ కావాలని అడుగుతున్నారు.
దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ముందుకు కదలటం లేదు. కొన్ని నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు పలువురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాము ఎల్ఆర్ఎస్కు ఓకే చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నదన్న ఆందోళనతో తిరస్కరించడం లేదా షార్ట్ఫాల్ డాక్యుమెంట్ రిమార్క్ చెప్తూ చేతులు దులుపుకుంటున్నారు.
కొన్ని లేఅవుట్లలోని ప్లాట్లకు ఇప్పటికే ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఇచ్చినా.. అదే లేఅవుట్లోని మిగతా ప్లాట్లకు క్లియరెన్స్ ఇవ్వటానికి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం 25.70 లక్షల దరఖాస్తులు రాగా, 65 వేల దరఖాస్తులను ఆమోదించారు. దాదాపు 3 లక్షల అప్లికేషన్లను తిరస్కరించడం, షార్ట్ఫాల్ డాక్యుమెంట్స్ పేరుతో ఆమోదించలేదు. మరోవైపు, ఎల్ఆర్ఎస్ ద్వారా ఖజానాను నింపుకోవచ్చని ప్రభుత్వం ఆశపడింది. కానీ, ఆ ఆశకు హైడ్రా గండికొడుతున్నది. అంటే.. పరోక్షంగా ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడుతున్నది. ఈ పర్యవసానాల నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం మరికొన్ని నెలలు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.