హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రిగా నాడు కేసీఆర్ (KCR) కృషితోనే నేడు 100 శాతం మురుగునీటిని శుద్ధిచేసే దేశంలోనే ఏకైక నగరంగా హైదరాబాద్కు ఖ్యాతి దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (KTR) కొనియాడారు. ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంబర్పేట సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) దాదాపు పూర్తయింది. మిగతా కొద్దిపాటి పనులను ఇప్పటి ప్రభుత్వం పూర్తిచేసింది. నాడు కేసీఆర్ పూర్తిచేసిన ఆ ప్లాంట్ను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించనున్నారు’ అని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు హైదరాబాద్ నగరమంతటా 31 ఎస్టీపీలను నిర్మించడానికి ఒక ప్రతిష్ఠాత్మక భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ ఎస్టీపీల వల్ల రోజుకు 1,259 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు శుద్ధి కానున్నదని, దీనివల్ల హైదరాబాద్ దేశంలో 100 శాతం మురుగునీటిని శుద్ధిచేసే ఏకైక నగరంగా మారనున్నదని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో తలపెట్టిన ఎస్టీపీ నిర్మాణాల పనులు దాదాపు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తిచేయకుండా రాజకీయాల కోసం ఇప్పటివరకూ జాప్యం చేసిందని విమర్శించారు. ఎట్టకేలకు పూర్తిచేసిన అంబర్పేట ఎస్టీపీకి గురువారం సీఎం రేవంత్రెడ్డి రిబ్బన్కట్ చేసి ప్రారంభించనున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలుచేసేందుకు నిర్మించిన మరో ప్రాజెక్టు తాజాగా వినియోగంలోకి వస్తుందని గుర్తుచేశారు. తాము ఆనాడు వాగ్దానం చేసినట్టుగా దేశంలోనే 100 శాతం మురుగునీటిని శుద్ధిచేసే మొదటి నగరంగా హైదరాబాద్ అవతరించబోతోన్నందుకు గర్వంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.