ఆర్కేపురం, జనవరి 20: అమెరికాలోని వాషింగ్టన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీకి చెందిన యువకుడు రవితేజ మృతి చెందాడు. 2022 మార్చి లో అమెరికా వెళ్లిన రవితేజ ఇటీవలే ఎంఎస్ మాస్టర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే 19న వా షింగ్టన్లో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో రవితేజ మరణించాడు. స్నేహితులు హైదరాబాద్‌లోని రవితేజ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలియగానే వారు శోకసంద్రంలో మునిగిపోయారు.
పదిహేను రోజుల క్రితం రవితేజ పుట్టినరోజని, తాను త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పాడని తండ్రి బొరున విలపించడం అందరినీ కలచివేసింది. రవితేజ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రవితేజ కుటుంబ సభ్యులను మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పరామర్శించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు మృతి చెందడం ఆ కుటుంబానికి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. రవితేజ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.