దుండిగల్, ఆగస్టు 12 : అమెరికాలోని చికాగోలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట సమీపంలోని రావురూకుల గ్రామానికి చెందిన శ్రీనివాసవర్మ, హేమలత దంపతులు కొంతకాలం క్రితం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్దకుమార్త్తె శ్రీజవర్మ (23) బీటెక్ పూర్తైన అనంతరం ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లి చికాగోలోని ఈస్టర్న్ ఇల్లీనియస్ వర్సిటీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉంది.
ఈ క్రమంలో సోమవారం రాత్రి ఓ రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసి ఎలక్ట్రిక్ సైకిల్‌పై తిరిగి అపార్ట్‌మెంట్‌కు వస్తుండగా ఓ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్నేహితులు ఓ వైద్యశాలకు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్టు ధృవీకరించారు. స్నేహితులు సమాచారాన్ని శ్రీజవర్మ కుటుంబసభ్యులకు తెలపడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకువచ్చేలా కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.