హయత్‌నగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ హయత్‌నగర్ ఎస్సై సైదులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ ఆరోపించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. ఓ వీడియో కూడా మీడియాకు విడుదల చేశారు. మహిళ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని హయత్‌నగర్ పోలీసులు ఖండించారు. ఇంట్లోని నగదు, నగలు, కారును తన భర్త శ్రీకాంత్ తీసుకెళ్లిపోయారని హయత్‌నగర్ పోలీసులకు కొన్నిరోజుల క్రితం మహిళ ఫిర్యాదు చేశారు. ఆ కారు తమ తల్లి పేరు మీద ఉందని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ మహిళ భర్త కర్నూల్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. కారును రికవరీ చేసి మహిళకు అప్పగించారు. డబ్బులు కావాలా అని ఎస్సైని అడిగితే కమిట్మెంట్ కావాలని ఒత్తిడి చేశారని మహిళ ఆరోపిస్తున్నారు.
సివిల్ కేసు కాబట్టి కోర్టుకు వెళ్లాలని సూచించాం
ఫిర్యాదు చేసిన మహిళ ఓ న్యాయవాది. ఆమె భర్త శ్రీకాంత్‌తో గొడవలు జరిగాయి. శ్రీకాంత్ ఇంట్లో చెప్పకుండా కారులో వెళ్లిపోయాడు. మహిళ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశాం. కారును తెప్పించి ఆమెకు అప్పగించాం. తన భర్త వద్ద ఉన్న బంగారం, నగలు ఇప్పించాలని ఎస్సై సైదులుపై మహిళ ఒత్తిడి చేశారు. అది సివిల్ కేసు కాబట్టి కోర్టులో తేల్చుకోవాలని ఎస్సై సూచించారు. తాను న్యాయవాదిని అని, తన కేసు పరిష్కరించాలని ఆమె ఒత్తిడి చేశారు. ఇప్పుడు ఎస్సైపై లైంగిక వేధింపుల పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు సదరు మహిళ మరో ఫిర్యాదుతో వచ్చారు. తన భర్త, అతడి సోదరుడి లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాడని, ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలసి తనపై దాడి చేసి, హత్యాయత్నం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం.
-నాగరాజు, హయత్‌నగర్ సీఐ