హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారిందని, శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం మీదుగా విదర్భ వద్ద తీరం దాటే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గురువారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేటలో భారీ వర్షాలు కురిశాయని వెల్లడించింది.
శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.