హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): దేశంలో ఒక రాష్ట్రం మరో రాష్ట్రం తో పోటీ పడుతుంది.. కానీ, తెలంగాణ మాత్రం ప్రపంచంతో పోటీ పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేవలం తొమ్మిదేండ్లలోనే అమెరికాతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ చేరుకున్నదని తెలిపారు. ఇది ప్రపంచంలోని ప్రతి తెలు గు బిడ్డకు గర్వకారణమని అన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరంలో రెండోరోజైన ఆదివారం తానా మహాసభలు వైభవం గా నిర్వహించారు. అమెరికా బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ నాగులవంచ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘తానా మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర, తానా సభల ప్రాముఖ్యత తదితర అంశాలపై మంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్నదని చెప్పారు. హైదరాబాద్కు వచ్చిన ప్రతిఒక్కరూ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. అనంతరం తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడారు. తానా సభలో తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్, ములుగు జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.