శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 9 : బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.5కోట్ల విలువ చేసే 13.2 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా వారి బ్యాగుల్లో ఆకుపచ్చరంగులో ఉన్న 22 ప్యాకెట్లు లభించాయి.
వాటిలో 13.2 కిలోల(హైడ్రోపోనిక్) గంజాయి లభ్యమైంది. ఇద్దరు ప్రయాణికుల వద్ద లభించిన గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద గంజాయి అధికంగా పట్టుబడుతుండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు.