Bhatti Vikramarka | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగంలో కలకలం సృష్టిస్తే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్క ప్రెస్‌మీట్‌తో ఏకంగా చిచ్చు పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయని భావిస్తున్న హైరైజ్ భవనాలకు ‘ఆక్రమణ’ల ముద్ర వేయడంతో ఆయా నిర్మాణ సంస్థలు లబోదిబోమంటున్నాయి. రూ.15 వేల కోట్ల విలువైన 11 బడా ప్రాజెక్టులను చెరువులను ఆక్రమిం చి నిర్మించారని భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ఇవ్వడంతో రాష్ట్రంలోని కార్పొరేట్ రియల్ఎస్టేట్ రంగం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. హైడ్రా కూ ల్చివేతల భయాలు ఆకాశహర్మ్యాలను చుట్టుముట్టా యి. వాటి భవిష్యత్ ఏమిటో తెలియక పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.
సాధారణంగా భారీ వెంచర్లు, హైరైజ్ బిల్డింగ్లు నిర్మించే రియల్ఎస్టేట్ సంస్థలు బ్యాంకుల నుంచి రూ.వందలాది కోట్లు రుణంగా తెచ్చి పెట్టుబడులు పె డుతుంటాయి. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం జోరు మీద ఉండటం, ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు ఉండటం, రెరా అనుమతులు ఉండటంతో బ్యాంకులు సైతం సులభంగా రుణాలు ఇచ్చేశాయి. భట్టి విక్రమార్క పేర్కొన్న 11 బడా నిర్మాణాలు రూ.15 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు అంచనా. కనీసం 50-70% వరకు బ్యాంకు రుణాలు ఉంటాయి. అంటే రూ.8 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్ల వరకు బ్యాంకులు వాటికి అప్పులు ఇచ్చాయన్నమాట. భట్టి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆ ప్రాజెక్టులు ఆక్రమణ నిర్మాణాలని తేల్చేయడంతో బ్యాంకింగ్ వర్గాలు సైతం ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వమే ఆక్రమణ నిర్మాణాలుగా తేల్చింది కాబట్టి తమ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయనే ప్రచారం జరుగుతున్నది. అసలే కష్టకాలంలో దాదాపు రూ.10 వేల కోట్లు ఎక్కడినుంచి తెచ్చి కడతామని నిర్మాణ సంస్థలు ఆవేదన చెందుతున్నాయి.
సాధారణంగా రూ.వందల కోట్ల విలువైన నిర్మాణాలు ఒక బడా నిర్మాణ సంస్థ పేరుతో జరుగుతున్నా, అందులో చిన్నచిన్న సంస్థలు, వ్యక్తులు భాగస్వాములుగా ఉంటాయి. రెండు మూడు శాతం మొదలు కొని వారికి వాటాలు ఉంటాయి. కొందరికి లాభాల్లో వాటా ఇచ్చేలా, మరికొందరికి ప్లాట్లు కేటాయించేలా ఒప్పందాలు చేసుకుంటారు. డిప్యూటీ సీఎం ప్రెస్‌మీట్ తర్వా త వారు లబోదిబోమంటున్నట్టు తెలిసింది. పెట్టుబడులు వెనక్కి ఇచ్చేయాలని ప్రధాన భాగస్వామిపై ఒత్తి డి తెస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. తమకు వాటాగా ప్లాట్లు వద్దని, లాభాలు కూడా వద్దని, ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి వెనక్కి ఇస్తే చాలని వేడుకుంటున్నారట. మరికొందరు ఇకపై ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టబోమని భీష్మిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక ప్రధాన భాగస్వామ్య కంపెనీ తలలు పట్టుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.
హైడ్రాతో అలజడి మొదలైతే.. భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ తమ పాలిట తుఫానుగా తయారైందని బడా రియల్ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, భారీ భవనాల నిర్మాణదారులు లబోదిబోమని మొత్తుకుంటున్నారట. ఇప్పటికే రియల్ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్నదని, హైదరాబాద్‌పై నమ్మకంతోనో, తమ పరపతి మీ దనో కొంత వరకు సేల్స్ జరిపామని ఇప్పుడు భట్టి ప్రకటనతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరయ్యిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. ‘కొత్తవి కొనడం దేవుడెరుగు. పాతవాటికి కూడా డబ్బులు అడుగుతున్నారు’ అని వాపోతున్నారట. ‘రెండు రోజుల కిందటిదాకా మా ఆఫీస్ ల్యాండ్ లైన్‌కు ఒక్కో నంబర్‌కు కనీసం రోజుకు సగటున 70-80 కాల్స్ వచ్చేవి. ప్రాజెక్టు గు రించి అడిగి వివరాలు తెలుసుకునేవారు. కానీ, ఇప్పు డు ఫ్లాట్ల గురించి అడిగే కాల్స్ బంద్ అయ్యాయి. పైగా మీ భవనం చెరువులో కట్టారంట కదా? హైడ్రా కూలగొడుతుందట కదా? అంటూ ఫోన్ చేసి మరీ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు’ అని ఒక నిర్మాణ సంస్థ మేనేజర్ చెప్పారు. పైగా తామే ఎవరినైనా సంప్రదించినా కాల్స్ ఎత్తడం లేదని, ఒకవేళ ఎత్తినా మీ ఫ్లాట్లు వద్దంటూ మొఖం మీదే చెప్పేస్తున్నారని వాపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు అర్జంట్‌గా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టిని, కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మళ్లీ ప్రభుత్వం నోటి నుంచే.. తమ ప్రాజెక్టులు అక్ర మం కాదని చెప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
హైరైజ్ భవనాల నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే నిర్మాణ సంస్థలు ప్లాట్ల అమ్మకాలు చేపడుతుంటాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్, నా ర్సింగి, పుప్పాలగూడ, సైబర్‌సిటీ, నెక్నాంపూర్ వంటి ప్రైమ్ ఏరియాల్లో భవనాలు కావడంతో ఆ వెంచర్లలో భారీ సంఖ్యలో ప్లాట్లు బుక్ అయ్యాయి. ఒక్కో ప్లాట్‌కు రూ.కోట్లు చెల్లించి బుక్ చేసుకున్నట్టు ఆయా సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు అక్రమమని డిప్యూటీ సీఎం తేల్చేయడంతో.. తమ అడ్వాన్స్‌ను వెనక్కి ఇవ్వాలని నిర్మా ణ సంస్థలను కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత సర్దిచెప్పినా వినడం లేదని, ‘మీ ప్లాట్లకో దండం.. మీకో దండం’ అంటూ మొఖంమీదే కుండబద్దలు కొడుతున్నారని వాపోతున్నారు.
భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్‌పై అటు ప్రభుత్వంలో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. అసలు భట్టి విక్రమార్క ఏ అర్హతతో ప్రెస్‌మీట్ పెట్టారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి భట్టి ప్రెస్‌మీట్ అని చెప్పగానే అందరూ ఆయన అమెరికా, జపాన్ పర్యటన విశేషాలు పంచుకుంటారని అనుకున్నారు. ఏయే పెట్టుబడులు సాధించారో ఘనంగా చెప్పుకుంటారని భావించారు. కానీ, అసలు ఆ అంశంతో సంబంధం లేకుండా, తన పరిధిలోకి రాని రియల్ఎస్టేట్ రంగం గురించి ప్రెస్‌మీట్ పెట్టడంతో అంతా అవాక్కయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ రియాల్టీ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు భట్టి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. రాష్ర్టానికి ఆయువుపట్టుగా ఉన్న హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగాన్ని సీఎం, డిప్యూటీ సీఎం కలిసి ఎందుకు పడగొడుతున్నారో అర్థం కావడం లేదని చెప్తున్నారు.