27 శాతం వృద్ధితో రెండో స్థానం
నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఉపాధి కల్పనలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఉద్యోగ నియామకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా మెట్రో నగరాల జాబితాలో ముంబై, చెన్నై, ఢిల్లీని అధిగమించి దేశంలోనే రెండో స్థానంలోకి ఎగబాకింది. ఈ జాబితాలో కోల్‌కతా 42% వృద్ధి రేటుతో అగ్రస్థానంలో, 25% వృద్ధి రేటుతో ముంబై తృతీయ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (24 శాతం), పుణె (23 శాతం) ఉన్నాయి. ఢిల్లీలో ఉపాధి కల్పన 15 శాతానికి పైగా తగ్గినట్టు ప్రముఖ ఆన్లైన్ జాబ్‌పోర్టల్ సంస్థ నౌకరీ.కామ్ ‘నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్’ వెల్లడించింది. ద్వితీయశ్రేణి నగరాల్లో కోయంబత్తూర్ 29% వృద్ధితో అగ్రస్థానాన్ని, 12% వృద్ధితో కొచ్చి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకొన్నట్టు తెలిపింది.
చండీగఢ్, వడదోర, జైపూర్ నగరాల్లో ఉపాధి కల్పన తగ్గినట్టు పేర్కొన్నది. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ నగరాలు, కీలక రంగాలు ఆర్థికంగా తిరిగి కోలుకొనే దశలో ఉన్నాయని నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన రవాణా, ఆతిథ్య రంగాలు పుంజుకొంటుండటమే ఇందుకు కారణమన్నారు. రానున్న రోజుల్లో నియామకాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు.