హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 250కి పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు రవాణాశాఖ కమిషనర్ శనివారం వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో అధికారుల బృందాలు విస్తృత తనిఖీలు చేశాయని పేర్కొన్నారు. పర్మిట్ రూల్స్‌కు విరుద్ధంగా సరుకులు తీసుకెళ్తున్న వాహనాలు, అనుమతుల్లేకుండా ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. తనిఖీలు ము న్ముందూ కొనసాగుతాయని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేశామని రవాణాశాఖ అధికారులు చెప్తుంటే.. ఇంతకాలం ఉదాసీనంగా ఉండి ఇప్పుడే తనిఖీలు చేపట్టడం ఏంటని ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అదనపు బస్సులను నడుపడమే గాకుండా 50 శాతానికిపైగా చార్జీలను వసూలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులను నియంత్రించేందుకు తనిఖీల పేరిట తమను ఇబ్బంది పెడుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.